ఐసీఐసీఐ బ్యాంక్ షాక్! మినిమమ్ బ్యాలెన్స్ రూ.50,000

ఐసీఐసీఐ బ్యాంక్ షాక్! మినిమమ్ బ్యాలెన్స్ రూ.50,000
X
మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే జరిమానా తప్పదు - నగదు లావాదేవీలకు కూడా కొత్త పరిమితులు అమల్లోకి

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్, కొత్తగా సేవింగ్స్ అకౌంట్ తెరవబోయే కస్టమర్లకు నెలవారీ సగటు బ్యాలెన్స్ (Monthly Average Balance - MAB) పరిమితిని భారీగా పెంచింది. ఈ కొత్త నియమాలు 2025 ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చాయి.

మెట్రో మరియు అర్బన్ బ్రాంచ్‌లలో కొత్త కస్టమర్లు కనీసం రూ. 50,000 బ్యాలెన్స్ ఉంచాలి. ముందు ఇది రూ 10,000 మాత్రమే ఉండేది. సెమి-అర్బన్ బ్రాంచ్‌లలో కనీస బ్యాలెన్స్ రూ 25,000 కాగా, ముందుగా ఇది రూ 5,000. గ్రామీణ బ్రాంచ్‌లలో కొత్త పరిమితి రూ 10,000గా నిర్ణయించబడింది, ఇది ముందుగా రూ 2,500 లేదా రూ 5,000 మాత్రమే. ఈ మార్పులు కేవలం కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి ఐసీఐసీఐ సంస్థ వెల్లడించింది, పాత కస్టమర్లకు పాత పరిమితులే కొనసాగుతాయి అని స్పష్టం చేసింది.

అవసరమైన మినిమమ్ బ్యాలెన్స్‌ను నెలలో ఉంచకపోతే బ్యాంక్ తక్కువగా ఉన్న మొత్తంలో 6% లేదా రూ 500, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది జరిమానా వసూలు చేస్తుంది. దీంతో కొత్త కస్టమర్లు ఈ షరతును తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

నగదు లావాదేవీలకు కూడా పరిమితులు పెట్టబడ్డాయి. నెలలో మూడు సార్లు వరకు నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా ఉచితంగా చేసుకోవచ్చు. ఉచిత పరిమితి రూ1 లక్ష వరకు మాత్రమే ఉంటుంది. దానిని మించితే ప్రతి అదనపు లావాదేవీకి రూ 150 లేదా ప్రతి రూ 1,000కు రూ 3.50 వసూలు చేస్తారు.

ఈ నిర్ణయం ప్రధానంగా పెద్ద మొత్తంలో బ్యాలెన్స్ ఉంచగల కస్టమర్లను ఆకర్షించడానికి తీసుకున్నట్లు తెలుస్తోంది. చిన్న పొదుపుదారులకు ఈ కొత్త షరతులు భారంగా మారవచ్చు. అందువల్ల కొత్త ఖాతా తెరవాలనుకునే వారు ముందుగా ఈ నియమాలను పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది.

Tags

Next Story