గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు మంచి సౌకర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.
మండప నిర్వాహకులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. పండుగ సమయంలో విద్యుత్ బిల్లులు భారంగా మారుతున్నాయని, ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో మాట్లాడారు.లోకేష్ వినతిని సీఎం సానుకూలంగా స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 15 వేల గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వం సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేయనుంది.
వినాయక చవితితో పాటు రాబోయే దసరా ఉత్సవాల్లో ఏర్పాటు చేసే దుర్గా మండపాలకు కూడా ఇదే సౌకర్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ నిర్ణయానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ) విడుదల కానున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గణేష్, దుర్గా భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకునేలా ప్రభుత్వం ముందడుగు వేసింది.
-
Home
-
Menu