ఎట్టకేలకు తాడపత్రి ఇంటిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడపత్రి రాజకీయ పరిణామాల్లో కీలక మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు ఆదివారం ఉదయం తాడపత్రిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. పోలీసుల పర్యవేక్షణ మధ్య ఆయన తాడపత్రిలో ప్రవేశించారు. ఇది స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రిలో తన నివాసంలో ఉండి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాడపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినా, జిల్లా పోలీసులు వివిధ కారణాలు చూపుతూ అనుమతి నిరాకరించడమే కాకుండా, ఆయన ప్రయాణాన్ని పలుమార్లు అడ్డుకున్నారు. ఈ అంశంపై పెద్దారెడ్డి, పలువురు వైసీపీ జిల్లా నేతలు జిల్లాస్పీని పలుసార్లు కలిసి వివరణ కోరినప్పటికీ, అనుమతి రాలేదు.
ఇదే సమయంలో, తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అనేకసార్లు మీడియా ముందుకొచ్చి – కేతిరెడ్డిని తాడపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదని, వచ్చారంటే అడ్డుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో తాడపత్రి రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడపత్రి తన ఇంట్లో అడుగుపెట్టడం రాజకీయంగా పెద్ద పరిణామంగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ఆయన నివాసానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది తాడపత్రి రాజకీయ రంగంలో కొత్త దశకు నాంది పలుకుతుందా అనే చర్చలు చోటుచేసుకుంటున్నాయి.
-
Home
-
Menu