20 ఏళ్ల పాత వాహనాల ఫీజులు రెట్టింపు

20 ఏళ్ల పాత వాహనాల ఫీజులు రెట్టింపు
X
కాలుష్య నియంత్రణ లక్ష్యంగా కేంద్రం కొత్త నిర్ణయం, పాత వాహనాల వల్లే ఎక్కువ కాలుష్యం బైక్‌ల నుంచి కార్ల వరకు అన్ని వాహనాల ఫీజులు పెంపు

కేంద్ర ప్రభుత్వం తాజాగా 20 సంవత్సరాల కంటే పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులను గణనీయంగా పెంచింది. ఈ నిర్ణయం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం మరియు పాత వాహనాల వాడకాన్ని నియంత్రించడానికి తీసుకుంది.పాత వాహనాలు సాధారణంగా ఎక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. నిపుణుల అంచనాల ప్రకారం దేశంలో వాహనాల వల్ల వచ్చే కాలుష్యంలో పెద్ద భాగం 20 సంవత్సరాల కంటే పాత వాహనాలదే. అందువల్ల ఈ వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఫీజులు రెండింతలు చేసింది.

కొత్త ఫీజుల ప్రకారం, రెండు చక్రాల వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుము ₹1,000 నుండి ₹2,000కి పెరిగింది. మూడు చక్రాల వాహనాలకు ₹3,500 నుండి ₹5,000గా మార్చారు. లైట్ మోటార్ వాహనాలు, అంటే కార్లకు ₹5,000 నుండి ₹10,000కు పెంచారు.

దిగుమతి చేసిన రెండు లేదా మూడు చక్రాల వాహనాల రుసుము ₹10,000 నుండి ₹20,000కు పెరిగింది. అదే విధంగా దిగుమతి చేసిన నాలుగు చక్రాల వాహనాల రుసుము ₹40,000 నుండి ₹80,000కి పెరిగింది. ఈ మొత్తాలకు అదనంగా GST కూడా వసూలు చేయబడుతుంది.

ఈ పెంపు 20 సంవత్సరాల కంటే పాత వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. 15 నుండి 20 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలకు మాత్రం ఎలాంటి ఫీజు పెంపు లేదు. ఆ వర్గం వాహనాలకు పాత రేట్లే కొనసాగుతాయి.

ఈ నిర్ణయం 2021లో ప్రకటించిన వాహనాల స్క్రాప్ పాలసీకి అనుసంధానం అయింది. ఆ విధానం ప్రకారం 20 సంవత్సరాల కంటే పాత ప్రైవేట్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత వాణిజ్య వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలి. ఫిట్నెస్ టెస్ట్‌లో విఫలమైతే వాహనాన్ని స్క్రాప్ చేయాల్సిందే.

ఈ పెంపు వాహన యజమానులపై ఆర్థిక భారం పెంచుతుంది. ముఖ్యంగా దిగుమతి చేసిన పాత వాహనాల యజమానులు భారీగా చెల్లించాల్సి వస్తుంది. మధ్యతరగతి ప్రజలు వాడే పాత బైక్‌లు, ఆటోలు, కార్లకూ అదనపు ఖర్చు అవుతుంది.ప్రభుత్వం ఉద్దేశ్యం పర్యావరణ పరిరక్షణ మరియు పాత వాహనాల తొలగింపు. అయితే ప్రజల ఆర్థిక భారాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Next Story