సామాన్యులకు డ్రోన్ సేవలు- ‘ఏపీ డ్రోన్ మార్ట్’ ప్రారంభించిన సీఎం

ప్రజలకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. సామాన్యులకు డ్రోన్ సదుపాయాలను సులభంగా అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన "ఏపీ డ్రోన్ మార్ట్" పోర్టల్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు (జూలై 14న) సచివాలయంలో ప్రారంభించారు.
ఈ పోర్టల్‌ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అభివృద్ధి చేయగా, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రతా పర్యవేక్షణ, భూ సర్వేలు, మ్యాపింగ్ వంటి అనేక రంగాల్లో "డ్రోన్ పోర్టల్" సేవలను అందించనుంది.
ఈ పోర్టల్ ద్వారా రైతులు తమ పంటలపై మందులు పిచికారీ చేయడం, పంటల ఎదుగుదల పర్యవేక్షణ చేయడం వంటి పనులను డ్రోన్ల సహాయంతో సులభంగా చేపట్టవచ్చు అని పేర్కొన్నారు సీఎం. పొలాల్లో పని చేసే చిన్న రైతులకూ తక్కువ ధరకు పోర్టల్ సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అన్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో స్థానిక పరిస్థితుల్ని డ్రోన్ల సహాయంతో త్వరగా అంచనా వేయవచ్చు అని, రోడ్లు, ఇళ్ళు, ఇతర నిర్మాణాల పర్యవేక్షణకు డ్రోన్లు మద్దతు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి అని వివరించారు చంద్రబాబు. సెక్యూరిటీ పరిక్షణ, భూ పరిమాణాలు కొలవడం వంటి పనులు మరింత సమర్థవంతంగా చేయొచ్చు అన్నారు.
ప్రస్తుతం ప్రారంభించిన సేవలే కాదు, భవిష్యత్తులో ఈ పోర్టల్ ద్వారా మరిన్ని ఆధునిక సదుపాయాలను అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అని తెలియచేసారు సీఎం. సర్వీస్ ప్రొవైడర్లతో నేరుగా కస్టమర్లు సంప్రదింపులు జరిపే అవకాశం ఉండడం, సరిహద్దులు లేని సేవలను అందించడంలో ఈ పోర్టల్ ముఖ్యపాత్ర పోషించనుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. డ్రోన్ సేవలు సామాన్యుల స్థాయికి తగ్గ ధరల్లో ఉండేలా చూసినట్లయితే ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
-
Home
-
Menu