కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై క్రమశిక్షణా చర్యలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై క్రమశిక్షణా చర్యలు
X
మునుగోడుకు నిధులు రాకపోవడమే అసలు కారణమని రాజగోపాల్ స్పష్టం - మల్లురవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో కేసు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన తన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు రాలేదని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాజగోపాల్ రెడ్డి అన్న దాని ప్రకారం, గత ఇరవై నెలలుగా మునుగోడు ప్రాంతానికి రోడ్లు, బిల్డింగ్‌లు, ఇతర పనుల కోసం కావాల్సిన నిధులు విడుదల కాలేదని తెలిపారు. ఈ సందర్భంలో ఆయన “పదవులు మీకే, పైసలు మీకేనా?” అంటూ వ్యాఖ్యానించారు.ఇక మంత్రి పదవి విషయంలో కూడా ఆయన నిరాశ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి తనకు హామీ ఇచ్చినా, ఆ హామీ నెరవేరలేదని ఆయన ఆరోపించారు. దీనితో ఆయనలో అసంతృప్తి మరింత పెరిగింది.అయితే, ఆయన అన్న, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, తమ్ముడు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాజగోపాల్ రెడ్డి మాటల ప్రకారం ఇది పైసల గురించి కాదు. మునుగోడులో పూర్తయిన పనుల బిల్లుల కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదనే కారణంతోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రజల అభివృద్ధి కోసం తాను మాత్రమే గళం వినిపించానని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవికి వివరించినట్టు చెప్పారు. తాను చెప్పిన విషయాలను వక్రీకరించి చూపుతున్నారని కూడా కోమటిరెడ్డి ఆవేదన తెలిపారు.

మార్వాడీల గురించి చేసిన తన వ్యాఖ్యపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వ్యాపారం చేస్తూ సమాజంలో భాగమై ఉన్న మార్వాడీలను వెళ్ళగొడతామనడం తగదని, వారు ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో భాగమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. బహిరంగంగా పార్టీ నాయకత్వంపై మాట్లాడడం క్రమశిక్షణా ఉల్లంఘనగా భావించి, ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణా సంఘానికి అప్పగించారు. మల్లురవి ఆధ్వర్యంలోని కమిటీ త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

ఇక ఈ పరిణామాలపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మల్లు రవి ఆధ్వర్యంలోని కమిటీకి బాధ్యత అప్పగించామని ఆయన చెప్పారు.



Tags

Next Story