ఉత్తరాంధ్రలో తీరం దాటిన వాయుగుండం

ఉత్తరాంధ్రలో తీరం దాటిన వాయుగుండం
X
కోస్తా జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు – అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరుకు ప్రత్యేక హెచ్చరిక

ఈరోజు ఉదయం ఉత్తర ఆంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల మధ్య గోపాల్‌పూర్ దగ్గర వాయుగుండం తీరం దాటింది. ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే ఆరు గంటల్లో ఇది బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. గత రెండు రోజులు కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర ఆంధ్ర గిరిజన మండలాల్లోని 60కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా, కమ్యూనికేషన్ సమస్యలు ఎదురవుతున్నాయి.

విజయవాడలోని ప్రకాశం బారేజ్ వద్ద వరద నీరు ఎక్కువగా చేరింది. దీనితో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని పలు పంటలు నీట మునిగే ప్రమాదం ఉంది. అధికారులు గ్రామాలను ఖాళీ చేయించి, సహాయక చర్యలు చేపడుతున్నారు.

తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. పొలాలు, పంటలు నష్టపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇప్పటివరకు ఏడుగురి వరకు ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం.

రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. సహాయక దళాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వైద్య, విద్యుత్, శానిటేషన్ విభాగాలు అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రస్తుతం సముద్రం అలజడిగా ఉంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ కఠినంగా ఆదేశాలు జారీచేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags

Next Story