సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి

సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి గారు 2025 ఆగస్టు 22న శుక్రవారం రాత్రి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చివరి శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఈ వార్త వెలువడగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నేతలు తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని CPI కార్యాలయంలో ఉంచి అనుచరులు, ప్రజలు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు, ఆయన శరీరాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి వైద్య పరిశోధనల కోసం అందజేశారు.
సీపీఐ అగ్రనేత, సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన విశేషమైన పాత్ర పోషించారని, ప్రముఖ వామపక్ష నాయకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారని జగన్ పేర్కొన్నారు. ఏ బాధ్యతలో ఉన్నా తన కృషితో ప్రత్యేక ముద్ర వేశారని ఆయన గుర్తుచేశారు.
సురవరం సుధాకర్ రెడ్డి గారు 1942 మార్చి 25న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, కొండ్రావుపల్లిలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు చదువుపై మంచి ఆసక్తి ఉండేది. కర్నూలులో డిగ్రీ చదివి పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం (LLB)లో పట్టభద్రుడయ్యారు. విద్యార్థి దశలోనే ఆయనకు సామాజిక సమస్యలపై ఆసక్తి పెరిగి, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం మొదలుపెట్టారు.
ఆయన రాజకీయ ప్రస్థానం విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రారంభమైంది. 1970లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తరువాత 1972లో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ రెండు పదవులు ఆయనకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఆయన అసెంబ్లీ రాజకీయాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించారు. 1985, 1990లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1994లో డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే మూడు సార్లూ విజయాన్ని సాధించలేకపోయారు. అయినప్పటికీ ప్రజలతో ఆయన అనుబంధం తగ్గలేదు. నిరంతరం ప్రజా సమస్యలపై కృషి చేస్తూ ముందుకు సాగారు.
1998లో ఆయన తొలిసారి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత 2004లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. పార్లమెంట్‌లో ఉన్నప్పుడు రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, విద్యా–ఆరోగ్య రంగాల లోపాలు వంటి ప్రజలకు సంబంధించిన అంశాలను బలంగా ప్రస్తావించారు.
ఆయన క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత వల్ల పార్టీ లోపల ప్రత్యేక స్థానం సంపాదించారు. 2012లో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. 2019 వరకు ఈ పదవిలో కొనసాగి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన నాయకత్వం వల్ల CPIలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది.
సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు, క్రమశిక్షణ కలిగిన రాజకీయవేత్త. ఆయన తన జీవితాన్ని మొత్తం ప్రజల సమస్యల పరిష్కారానికి, కార్మిక–రైతుల హక్కుల కోసం అంకితం చేశారు. CPIలో ఆయన చేసిన కృషి, ప్రజలతో ఉన్న అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
-
Home
-
Menu