₹9,000 కోట్ల డీల్ పై పార్లమెంట్ లో వివాదం!

రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) ఇటీవల రూ.9,000 కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDs) జారీ చేసింది. అయితే, ఈ డిబెంచర్ల నిర్వహణ పద్ధతిపై ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. ముఖ్యంగా, ఈ డబ్బులు ఎలా తిరిగి చెల్లించబడతాయన్న దానిపై అనేక రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి.
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ అంశాన్ని ప్రత్యేక అధికరణ 377 ద్వారా లోక్‌సభలో ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
MP గురుమూర్తి ఆరోపించినట్లు, ఈ డిబెంచర్ల రీపేమెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా నిధులు ఉపసంహరించుకునే అధికారం ఒక ప్రైవేట్ డిబెంచర్ ట్రస్టీకి ఇవ్వబడింది . ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన డైరెక్ట్ డెబిట్ మాండేట్ ద్వారా సాధ్యమైంది.
అయితే, రాష్ట్ర ఖజానా నుంచి నిధులు తీసుకోవాలంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తప్పనిసరి అని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204 స్పష్టంగా పేర్కొంటున్నాయని ఆయన గుర్తు చేశారు ఎంపీ. ఈ మాండేట్, ఆర్టికల్స్‌ను బైపాస్ చేస్తోందని, ఇది రాష్ట్ర ఆర్థిక నియంత్రణను శాసనసభ నుంచి తొలగించినట్లేనని గురుమూర్తి తన అభిప్రాయం వ్యక్తపరిచారు.
ఈ డిబెంచర్ల ద్వారా వచ్చిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లీజులకు ప్రతిఫలంగా పొందుతోందని, ఇది వాస్తవానికి అప్పు చేసిన చర్య అని గురుమూర్తి పేర్కొన్నారు. అంతేగాక, ఆర్టికల్ 293(3) ప్రకారం, ఇప్పటికే కేంద్రానికి బాకీ ఉన్న రాష్ట్రాలు ముందస్తుగా కేంద్ర అనుమతి లేకుండా అప్పు చేయరాదు. ఈ నిబంధనను ఈ వ్యవహారం ఉల్లంఘించిందని ఆయన ప్రశ్నించారు.ఈ విషయాన్ని ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ కోణంలో చూస్తూ, గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణ జోక్యం చేసుకుని ఈ వ్యవహారంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అంశం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, న్యాయబద్ధత ఎంత ముఖ్యమో మరోసారి తెలియజేస్తోంది. డిబెంచర్ల మాదిరి ఫైనాన్షియల్ మెకానిజమ్‌లు రాజ్యాంగ నియమావళిని గౌరవించకుండా అమలు చేయబడితే, అది అపాయంగా మారే అవకాశం ఉంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
-
Home
-
Menu