ధన్ఖడ్ రాజీనామా పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

భారత రాజ్యాంగంలో అత్యంత గౌరవనీయమైన పదవుల్లో రెండో స్థానం – ఉపరాష్ట్రపతి పదవి. త్రివిధ దళాలకు అధిపతి అయిన రాష్ట్రపతి తర్వాత దేశ ప్రోటోకాల్ ప్రకారం ఈ స్థానం ఉంటుంది. అంతటి గొప్ప బాధ్యతను కలిగిన పదవిలో ఉన్న జగదీప్ ధన్ఖడ్ అర్ధాంతరంగా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది.
ధన్ఖడ్ రాజీనామా చేయడానికి కారణంగా ఆరోగ్య సమస్యలనే పేర్కొన్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు, విశేష ప్రజాగమనాన్ని గమనించిన నిపుణులు మాత్రం ఈ ప్రకటన వెనుక ఉన్న నిజాయితీపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇటువంటి పదవుల్లో ఉన్న వారికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు, విదేశీ చికిత్సల వరకూ అందించేందుకు కేంద్రం వెనుకాడదు. గతంలో కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతిగా అనారోగ్యంతో బాధపడినప్పుడు విదేశాల్లో చికిత్స చేయించిన ఉదాహరణ ఉందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
అలాగే, ఉపరాష్ట్రపతి పదవిలో ఉండే ఒత్తిడి అంతగా ఉండదు. సభలు నెలకు కొన్ని రోజులు మాత్రమే జరుగుతాయి. కో-చైర్మన్లు కూడా సహకరిస్తారు. కనుక ఆరోగ్యం లేదా ఒత్తిడి కారణాలు సజావుగా ఒప్పుకోదగినవిగా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు రాజకీయ కారణాలు ఈ రాజీనామా వెనుక ఉన్నాయని తీవ్రంగా చర్చించబడుతోంది.
ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ వ్యూహాత్మకంగా ఓ బలమైన బీజేపీ నేతకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా ఓట్లు సాధించాలనే మినీ మిషన్‌పై ఉన్నదన్న ప్రచారం ఉంది. రాష్ట్రపతిగా ఇప్పటికే ఓ ఆదివాసీ మహిళను నియమించడంతో, మళ్ళీ ఆమెకు రాజీనామా చెప్పడం కుదరదు. అందుకే ధన్ఖడ్‌నే రాజీనామా చేయించినారా అనే "మిలియన్ డాలర్ ప్రశ్న" దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.
జాతీయ మీడియా ప్రకారం, బీహార్‌కు చెందిన ఓ ముఖ్య నేతను కొత్త ఉపరాష్ట్రపతిగా తెరపైకి తేవాలన్న ఆలోచన బీజేపీలో నడుస్తోందట. దీనికి అనుగుణంగా ధన్ఖడ్ తొలగింపునే ఒక వ్యూహంగా అనుకోవచ్చునన్న భావన బలపడుతోంది.
ఇక ఇప్పటికే ధన్ఖడ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా, ఆయన స్వతంత్ర సంస్థలపై, న్యాయవ్యవస్థపై తాను చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించింది. జైరాం రమేష్ సహా అనేక కాంగ్రెస్ నేతలు ధన్ఖడ్ మీద మండిపడ్డారు. ఆయన పదవికి అనర్హుడని, ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ధన్ఖడ్ మాట్లాడుతూ, "ప్రజాప్రతినిధుల కంటే న్యాయవ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమనే వ్యవస్థ సరైంది కాదని" పేర్కొనడం తీవ్ర విమర్శలకు గురైంది. ఈ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను రాజకీయ రంగంలోకి లాగుతున్నట్లు స్పష్టమవుతుందని విపక్షాలు పేర్కొన్నాయి.
ధన్ఖడ్ 2022లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి, ఇంకా రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ, ఆయన రాజీనామా చేసేందుకు తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో అయింది. ఒకవైపు ఆరోగ్య కారణాలు, మరోవైపు రాజకీయ వ్యూహాల మధ్య నడుస్తున్న ఈ నాటకం ఎటు వెళ్లనుంది అనేది తేలాల్సి ఉంది. ఇక కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరు వస్తారన్నది, బీహార్ ఎన్నికలపై దీనివల్ల ఏ మేరకు ప్రభావం ఉంటుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
-
Home
-
Menu