పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాడేరులో పర్యటించారు. వంజంగిలోని వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్న అనంతరం, సమీపంలోని అరకు కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీ రైతులతో మాట్లాడి, సాగులో ఎదురవుతున్న సమస్యలు, అవసరాలు గురించి ఆరా తీశారు.
పాడేరు ప్రజావేదిక ప్రాంగణంలో జరిగిన సమావేశంలో, గిరిజన ప్రాంతాల శాశ్వతాభివృద్ధికి అనేక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రహదారులు, వంతెనలు, మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం, శుద్ధ పానీయ నీటి సరఫరా, ఎకో-టూరిజం, సహకార వ్యవసాయం వంటి పథకాలకు భారీ నిధులను మంజూరు చేశారు.
అరకు కాఫీ ప్రాసెసింగ్, అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులకు ఈ-కామర్స్ వేదికల ద్వారా దేశ, విదేశ మార్కెట్లలో విక్రయ అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ విస్తరించేందుకు సూచనలు ఇచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు నివారణపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. డ్రోన్ల వినియోగంతో గంజాయి సాగును అరికట్టాలని సూచించారు. త్వరలోనే పాడేరు ప్రాంతాన్ని "జీరో గంజా జోన్"గా ప్రకటించాలని నిర్ణయించారు. గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించగలిగితే, టూరిజం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సెరికల్చర్ సాగు జరుగుతున్నట్టు అధికారులు వివరించారు. ఆ పట్టుదారాలతో నేసిన వస్త్రాలను పరిశీలించిన సీఎం, నిఫ్ట్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఏజెన్సీ వస్త్రాలకు గ్లోబల్ మార్కెట్ కల్పించవచ్చని సూచించారు. వస్త్రాల విక్రయానికి మంచి భాగస్వాములను అన్వేషించాలని ఆదేశించారు.
డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్‌ను సందర్శించి కాఫీ రుచి చూశారు. వారి ఆదాయం గురించి ప్రశ్నించారు. స్థానికంగా లభించే మిల్లెట్, కూకీస్, చాక్లెట్ల తయారీపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు.
-
Home
-
Menu