ఈ రోజు రాత్రికి చంద్రబాబు సింగపూర్ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాబట్టుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.ముందుగా చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకొని,హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 6 రోజులపాటు చంద్రబాబు అక్కడున్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరిపి, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు.
పర్యటనలో ముఖ్యంగా తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని, సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల నుండి ఏపీలో పెట్టుబడులు పెట్టమని కోరే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా పేదరిక నిర్మూలనకు తీసుకొచ్చిన పీ4 పధకం గురించి కూడా వివరించి, పారిశ్రామిక వేత్తలను ఆ పథకంలో భాగస్వాములు కావాలని కోరనున్నారు.
సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు "బ్రాండ్ ఏపీ" ప్రచారాన్ని వేదికగా ఉపయోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరిస్తూ, పెట్టుబడుదారులను ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, ఎయిర్‌పోర్టులు, హైవేలు, హార్బర్లు, 1053 కి.మీ తీర ప్రాంతం వంటి మౌలిక సదుపాయాలు, నిపుణులైన మానవ వనరులు గురించి వివరిస్తారు.
పర్యటనలో పెద్ద కంపెనీలు మరియు పారిశ్రామిక వేత్తలు నుండి పెట్టుబడులు రాబట్టేందుకు చర్చలు జరుపుతారు. విశాఖలో ఈ ఏడాది నవంబరులో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు సింగపూర్‌లోని ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ కాన్నున్నారు.
డిజిటల్ ఎకానమీ మరియు ఫిన్‌టెక్ వంటి రంగాలలో పెట్టుబడులు రాబట్టేందుకు కూడా ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. సింగపూర్‌లోని మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.
సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టి.జి.భరత్, మరియు ఎపి ఎన్ఆర్‌టీ చైర్మన్ వేమూరి రవికుమార్ పాల్గొననున్నారు. 27వ తేదీన, "వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్" లో ప్రవాసాంధ్రులతో సమావేశం జరిపి, విదేశీ పెట్టుబడులు మరియు అమరావతి నిర్మాణం గురించి వివరించనున్నారు.
-
Home
-
Menu