కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన చంద్రబాబు

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆర్థిక సహాయం అందించమని ముఖ్యమంత్రి కోరారు.
ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (SASCI) పథకం కింద రూ. 2,010 కోట్ల సహాయం లభించిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పక్కా ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని కేంద్రానికి వినతిపత్రం సమర్పించారు.
అదేవిధంగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA Sparsh) ప్రోత్సాహక పథకం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ. 250 కోట్ల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలి అని కూడా వినతిపత్రంలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి మంచి లాభాలు కలగబోతాయని, పథకం విధివిధానాలను త్వరగా రూపొందించి అమల్లోకి తేవాలని కేంద్ర ఆర్ధికశాఖ నిర్మలా సీతారామన్ ని కోరారు.
-
Home
-
Menu