వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసిందన్న సీబీఐ

మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దర్యాప్తులో అవసరమైన అన్ని ఆధారాలను సేకరించామని, విచారణ పూర్తి దశకు చేరుకుందని సీబీఐ ధర్మాసనానికి నివేదించింది.
సుప్రీంకోర్టు ఆదేశిస్తే మాత్రమే తదుపరి దశలలో విచారణ కొనసాగిస్తామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ ప్రకటనను సీబీఐ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. విచారణపై పూర్తి నివేదిక సమర్పించిన నేపథ్యంలో, తదుపరి చర్యలపై ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును మళ్లీ విచారించేందుకు తదుపరి తేదీని నిర్ధారించనుంది. విచారణ తుది దశకు చేరుతున్న నేపథ్యంలో, నిందితులపై విచారణ, ట్రయల్ ప్రక్రియ వేగంగా జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
2019లో కడప జిల్లాలో జరిగిన వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొదట్లో రాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించినా, తర్వాత సీబీఐకి బాధ్యత అప్పగించబడింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా వై.ఎస్. అవినాష్ రెడ్డి, వై.ఎస్. భాస్కర్ రెడ్డిల పేర్లు చార్జీషీటుల్లో పేర్కొనబడ్డాయి.ఈ హత్య కేసు దర్యాప్తు ఇప్పటికే నాలుగేళ్లకు పైగా సాగుతున్న నేపథ్యంలో, బాధిత కుటుంబ సభ్యులు, ముఖ్యంగా బాధితుల తరఫు వివేకానందా రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి ఈ కేసులో విచారణ వాయిదాలపై పలుమార్లు కోర్టును ఆశ్రయించారు.
గతంలో సుప్రీంకోర్టు ఈ హత్య కేసును వేగంగా పూర్తి చేయాలని సీబీఐకి గడువులు విధించింది. అయినా విచారణ ఆలస్యమవుతోందన్న కారణంగా కేసు మరింత సాగుతూ వస్తోంది.ఇప్పుడు సీబీఐ దర్యాప్తు పూర్తయ్యిందని ప్రకటించడంతో, ఈ కేసులో తదుపరి కోర్టు ఆదేశాలు కీలకంగా మారనున్నాయి.
-
Home
-
Menu