ఐటీ రంగానికి క్యాప్‌జెమినీ శుభవార్త

దేశీయ ఐటీ రంగంలో భారీగా 'లేఆఫ్స్' జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, క్యాప్‌జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 40,000 నుండి 45,000 మందిని నియమించుకోవాలని సంస్థ ప్రకటించింది. ఐటీ రంగం నియామకాలలో సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ, ఈ నిర్ణయం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కొత్త నియామకాలలో సుమారు 35% నుంచి 40% వరకు అనుభవజ్ఞులైన వారు ఉంటారు. వీరిని కీలక విభాగాలలో నియమించనున్నారు. మిగతా ఉద్యోగాలను దేశవ్యాప్తంగా 50కి పైగా ఇంజినీరింగ్ కళాశాలలతో భాగస్వామ్యం ద్వారా ఫ్రెషర్లతో భర్తీ చేయాలని సంస్థ భావిస్తోంది. కొత్తగా చేరే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ప్రత్యేక శిక్షణ అందించి, వారు నేరుగా AI ప్రాజెక్టులపై పనిచేయగల సామర్థ్యం పొందేలా చేయడమే కంపెనీ లక్ష్యంగా తెలుస్తుంది
ఇదే సమయంలో, క్యాప్‌జెమినీ AI సామర్థ్యాలను మరింత పెంచే దిశగా పెద్ద అడుగు వేసింది. సుమారు $3.3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం ద్వారా WNS(World Network Services)ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇది మ్యాన్‌పవర్ పరంగా సంస్థకు అతిపెద్ద కొనుగోలు కానుంది. ప్రస్తుతం ఈ లావాదేవీకి రెగ్యులేటరీ ఆమోదం అవసరం ఉంది, ఇది 2025 చివరినాటికి పూర్తవుతుందని అంచనా. WNSలో సుమారు 64,000 మంది ఉద్యోగులు ఉన్నారు, అందులో పెద్ద భాగం భారతదేశంలోనే పనిచేస్తున్నారు.
WNSకు చెందిన ఏజెంటిక్ AI సొల్యూషన్స్‌ను ఇప్పటికే క్యాప్‌జెమినీ తన అనలిటిక్స్, కన్సల్టింగ్ విభాగాలలో విలీనం చేసింది. దీని ద్వారా ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ మరియు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్‌లో కంపెనీ సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ కొనుగోలు ఫలితంగా 2026 నాటికి కంపెనీకి 4% లాభం (EPS) పెరుగుతుందని, 2027 నాటికి 7% పెరుగుదల సాధ్యమవుతుందని అంచనా. అలాగే €100–140 మిలియన్ అదనపు ఆదాయం, €50–70 మిలియన్ ఖర్చు తగ్గింపు కూడా సాధ్యమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు లేఆఫ్స్ ప్రకటిస్తున్న సమయంలో, క్యాప్‌జెమినీ చేపట్టిన ఈ భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మరియు వ్యూహాత్మక కొనుగోలు ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
-
Home
-
Menu