భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు అల్లూరి సీతారామ రాజు పేరు

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అధికారికంగా "అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం (ASRIA)" అని పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతూ, మొదటి దశలో 84% పనులు పూర్తవుతున్నాయి. అధికారుల అంచనా ప్రకారం, ఇది జూన్ 2026లో ప్రారంభం కానుంది.
ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ప్రారంభ దశలో ఇది సంవత్సరానికి సుమారు 60 లక్షల ప్రయాణికులను అందుకోగలదు. రెండో దశలో మరో రన్‌వే నిర్మించనున్నారు. చివరి దశలో మొత్తం సామర్థ్యాన్ని 4 కోట్ల ప్రయాణికులకు పెంచే ప్రణాళిక ఉంది.
ఈ ప్రాజెక్ట్‌ను 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు ₹4,700 కోట్లు అంచనా వ్యయంతో, 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అభివృద్ధి కోసం 2,700 ఎకరాల భూమి సేకరించారు. మొదట 2023లో పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ఆలస్యమైంది. తిరిగి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు డిసెంబర్ 2026 గడువుకంటే ఆరు నెలలు ముందే, జూన్‌లోనే ప్రారంభం అవుతుందని అధికారులు ధృవీకరించారు.
ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టి ఆయన స్ఫూర్తిదాయకమైన సేవలకు గౌరవం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం 2024 నవంబర్‌లో అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది.అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక సౌకర్యాలతో ఈ విమానాశ్రయం నిర్మితమవుతోంది. ఇది పూర్తయ్యాక ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు ప్రధాన ద్వారం అవుతుంది. చాలా ఏళ్లుగా ప్రజల కోరికగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నెరవేరబోతోంది. భవిష్యత్ తరాల కోసం ఇది అంతర్జాతీయ స్థాయి రవాణా కేంద్రంగా నిలుస్తుంది.
-
Home
-
Menu