డ్రీమ్11తో BCCI స్పాన్సర్‌షిప్ రద్దు

భారత క్రికెట్ బోర్డు (BCCI) మరియు ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 మధ్య ఉన్న స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదమైన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025. ఈ బిల్లుతో నగదు ఆధారంగా ఆడే ఆన్‌లైన్ గేమ్స్‌పై పూర్తి నిషేధం విధించారు.
ఈ కొత్త చట్టం ప్రకారం, డబ్బు పెట్టి ఆడే గేమ్స్ (Real Money Games) నిషేధించబడ్డాయి. అలాంటి గేమ్స్‌కి సంబంధించిన యాప్‌లు, వాటి ప్రచారాలు, స్పాన్సర్‌షిప్‌లు అన్నీ ఆగిపోవాలి. దీంతో డ్రీమ్11 తన ప్రధాన వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకంటే, వారి ఆదాయంలో పెద్ద భాగం రియల్ మనీ ఫాంటసీ గేమ్స్ నుంచే వస్తోంది.
2023లో డ్రీమ్11, భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ₹358 కోట్ల ఒప్పందం చేసుకుంది. అయితే, చట్టం మారిన వెంటనే కంపెనీ బీసీసీఐకి సమాచారం ఇచ్చి, ఈ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఒప్పందంలోనే "చట్ట మారితే రద్దు చేసుకోవచ్చు" అన్న ప్రత్యేక క్లాజ్ ఉండటంతో, డ్రీమ్11పై ఎలాంటి జరిమానా లేదా ఆర్థిక భారం పడలేదు.
ఇకపై డబ్బు ఆధారిత ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలతో సంబంధాలు కొనసాగించబోమని BCCI కూడా స్పష్టంగా ప్రకటించింది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సాయికియా మాట్లాడుతూ, “దేశ చట్టాలను గౌరవిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి కంపెనీలతో ఒప్పందాలు ఉండవు” అని చెప్పారు.
ఇప్పటికే ఆసియా కప్ 2025 సమీపిస్తున్నందున, బీసీసీఐ కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభించనుంది. ఆసియా కప్‌కి ముందు కొత్త భాగస్వామ్యాన్ని ఖరారు చేయాలని బోర్డు యోచిస్తోంది.డ్రీమ్11 మాత్రమే కాదు, MPL వంటి మరికొన్ని పెద్ద ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు కూడా ఈ బిల్లుతో తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వేలాది ఉద్యోగాలు, పెట్టుబడులు, వ్యాపారాలు ఇప్పుడు సంక్షోభంలో పడ్డాయి.
-
Home
-
Menu