కాంగ్రెస్ విమర్శలకు బండి సంజయ్ కౌంటర్

కాంగ్రెస్ విమర్శలకు బండి సంజయ్ కౌంటర్
X
దొంగ ఓట్లు ఉన్నాయంటే తొలగించి ఎన్నికలకు రండి – కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రలో భాగంగా, బీజేపీ నేతలు దొంగ ఓట్లతో గెలిచారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.

బండి సంజయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దొంగ ఓట్లు ఉన్నాయని నిజంగానే అనుకుంటే, వాటిని తొలగించి ఎన్నికలకు వెళ్దాం. కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరారు.

అలాగే కరీంనగర్ ప్రజలు తనను 2 లక్షల 25 వేల మెజారిటీతో గెలిపించారు. అలాంటి ప్రజలను కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేసారంటూ అవమానించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కన్పిస్తే ప్రజలకు కోపం వచ్చి రాళ్లతో కొట్టే స్థితిలో ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు.బండి సంజయ్ మాట్లాడుతూ ఇప్పటికే 20 నెలల పాలనలో పంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వని పార్టీ కాంగ్రెస్ మాత్రమే. పంచాయతీలకు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ నిధుల కోసం మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని చూస్తున్నారు అని ఆరోపించారు.

అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను హేళన చేస్తూ, వార్డు మెంబర్ గా కూడా గెలవలేని మహేష్ గౌడ్‌కు దొంగ ఓట్ల గురించి ఏం తెలుసు? ఎప్పుడో తనను బీసీ అన్నది ఆయనే, ఇప్పుడు దేశ్‌ముఖ్ అని చెప్పేది కూడా ఆయనే. ఒకే విషయాన్ని మర్చిపోయి మళ్లీ మళ్లీ చెప్పడం చూస్తే గజినీ సినిమా గుర్తుకు వస్తుంది అన్నారు.

బండి సంజయ్ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీసీ వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే ఓడించాలని ప్రయత్నించింది. ఎన్నికలొస్తే మసీదుల్లోకి వెళ్లి టోపీలు పెట్టుకొని ఓట్లు అడుగుతున్న బిచ్చగాళ్లు కాంగ్రెస్ నాయకులే అని ఎద్దేవా చేశారు.

తాను కరీంనగర్‌లో భారీ మెజారిటీతో గెలవడానికి హిందూ ఓటు బ్యాంకు కారణమని, తెలంగాణలో కూడా హిందూ ఓటు బ్యాంకును బలంగా తయారు చేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికలున్నా లేకున్నా హిందూ సమాజం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.

రోహింగ్యా సమస్యపై కాంగ్రెస్ చేసిన విమర్శలకు సమాధానం ఇస్తూ,తెలంగాణలోకి వచ్చిన రోహింగ్యాలు అంతా 2014కు ముందే వచ్చారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌నే. వాళ్లకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చింది కూడా కాంగ్రెస్‌నే. ఇవన్నీ ఓటు బ్యాంకు కోసం చేసింది అని అన్నారు.వాస్తవాలు తెలియకుండా మాట్లాడే వారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులే. ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

Tags

Next Story