30 ఏళ్ల పిండం నుంచి శిశువు జననం – ప్రపంచ రికార్డు

అమెరికా దేశంలోని ఓహియో రాష్ట్రంలో వైద్య చరిత్రలో చోటుచేసుకున్న ఓ అరుదైన ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. జూలై 26, 2025న థాడెయస్ డానియల్ పియర్స్ అనే మగ శిశువు జన్మించాడు. ఈ శిశువు విశేషం ఏమిటంటే — ఇతను 1994లో క్రయో ప్రిజర్వేషన్ (శీతలీకరణ) పద్ధతిలో నిల్వ చేసిన పిండం నుంచి పుట్టాడు. అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ పిండం సజీవ శిశువుగా మారింది. వైద్య నిపుణుల ప్రకారం ఇది రీప్రొడక్టివ్ మెడిసిన్‌లో చరిత్ర సృష్టించిన ఘట్టం. థాడెయస్ ఇప్పుడు ప్రపంచంలోనే “ఓల్డెస్ట్ బేబీ బాయ్”గా రికార్డుల్లో నిలిచాడు.
ఈ పిండంను 1994లో అమెరికాకు చెందిన లిండా ఆర్చర్డ్ మరియు ఆమె భర్త కృత్రిమ గర్భధారణ IVF (In-Vitro Fertilization)పద్ధతిలో సృష్టించారు. మొత్తం నాలుగు పిండాలు ఏర్పడ్డాయి. అందులో ఒక పిండం అదే సంవత్సరం లిండా గర్భాశయంలో అమర్చి, ఆమెకు ఒక కుమార్తె జన్మించింది. మిగిలిన మూడు పిండాలను క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ ద్వారా శీతలీకరించి నిల్వ చేశారు. ఈ పిండాలను ఎవరికి ఇవ్వకూడదని లిండా నిర్ణయించుకుని, వాటి భద్రతకు సంవత్సరాల పాటు వేల డాలర్లు ఖర్చు చేసింది.
ఓహియో రాష్ట్రానికి చెందిన లిండ్సే మరియు టిమ్ పియర్స్ దంపతులు ఎన్నో సంవత్సరాలు సంతానం కోసం ప్రయత్నించారు. అయితే వారికి ఆ భాగ్యం కలగలేదు. చివరికి పిండం దత్తత (Embryo Adoption) మార్గాన్ని ఎంచుకున్నారు. Nightlight Christian Adoptions సంస్థకు చెందిన ‘Snowflakes’ కార్యక్రమం ద్వారా లిండా ఆర్చర్డ్ భద్రపరచిన పిండాలు వారికి అందుబాటులోకి వచ్చాయి. లిండా విధించిన షరతులు పియర్స్ దంపతులకు సరిపోవడంతో, రెండు పిండాలను లిండ్సే గర్భంలోకి ప్రవేశపెట్టారు.
ఇందులో ఒక పిండం సజీవంగా ఎదిగి, 2025 జూలై 26న థాడెయస్ డానియల్ పియర్స్‌గా జన్మించాడు. మిగిలిన పిండం సజీవంగా మిగలలేదు. ఈ జననం, 2022లో ఒరెగాన్‌లో 30 సంవత్సరాల క్రయో ప్రిజర్వేషన్ తర్వాత పుట్టిన కవలల రికార్డును అధిగమించింది.
వైద్య నిపుణులు ఈ ఘటనను వైద్య సాంకేతికతలో గొప్ప మైలురాయిగా పేర్కొంటున్నారు. 1990లలో శీతలీకరించిన పిండాలను ఇప్పటికీ జీవన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని ఇది నిరూపించింది. ఇది సంతానం కోసం తహతహలాడుతున్న దంపతులకు కొత్త ఆశను ఇచ్చింది. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల క్రయో పిండాలను(శీతలీకరించిన) భవిష్యత్తులో ఉపయోగించే మార్గంపై నైతిక, చట్టపరమైన చర్చలకు ఇది దారితీస్తోంది.
-
Home
-
Menu