అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 30 నుంచి ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగాలి, ఏయే అంశాలను ప్రధానంగా చర్చించాలి అనే విషయాలను రెండో రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
ఇక అసెంబ్లీ సమావేశాలంటే అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య వాగ్వాదాలు తప్పవని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పినాకి చంద్రఘోష్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చర్చించనుంది. ఆ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు చూపించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం. దీనికి బీఆర్‌ఎస్ గట్టి ప్రతిస్పందన ఇవ్వడం ఖాయం. దీంతో సభలో గట్టి వాదోపవాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారి వస్తారా లేదా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో ఆయన ఒక్కసారి మాత్రమే సభకు వచ్చారు. అది కూడా బడ్జెట్ సమావేశాల్లో కొద్దిసేపు హాజరై వెళ్లిపోయారు. దాదాపు ఇరువై నెలలుగా ఆయన అసెంబ్లీ ముఖం చూడలేదు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ వ్యక్తిగతంగా ఆహ్వానించినా కూడా కేసీఆర్ స్పందించలేదు. అంతేకాకుండా సీఎం రేవంత్ బహిరంగ సభల్లో పలుమార్లు కేసీఆర్‌కు సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన హాజరవుతారా అనే విషయంపై అందరి దృష్టి నిలిచింది.
ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్ తనవైపు నుండి కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్‌ఎస్ పట్టుదలగా ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్‌కు గడువు విధించినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ అసెంబ్లీలో మళ్లీ ప్రస్తావించడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ వేదికలో ఇరుపక్షాలు ఎదురెదురుగా నిలబడి చర్చించే అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పెరుగుతున్న దొంగతనాలు, హత్యలు, చట్టం-శాంతి సమస్యలను బీఆర్‌ఎస్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. దీంతో ఈ వర్షాకాల సమావేశాలు రాజకీయంగా హోరాహోరీ చర్చలకు వేదిక అవుతాయని చెప్పొచ్చు.
-
Home
-
Menu