మద్యం – ఇప్పుడు ఇంటికే!

కేరళ ప్రభుత్వానికి బేవ్కో (Kerala State Beverages Corporation) ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీని ప్రకారం, మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే డెలివరీ చేసే అవకాశం కల్పించనుంది. దీని కోసం స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ సంస్థలతో ఒప్పందం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మద్యం షాపుల వద్ద రోజూ కనిపించే పొడవైన క్యూలు, రోడ్లపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే ఈ ప్రణాళిక ఉద్దేశ్యంగా అధికారులు చెపుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసే అవకాశం కల్పిస్తే, ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, అలాగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందని BEVCO భావిస్తోంది. గత సంవత్సరం బేవ్కోకు సుమారు ₹19,700 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ సేవను కేవలం 23 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే అందిస్తారు. ఆర్డర్ చేసిన వ్యక్తి వయసును డెలివరీ సమయంలో ఐడీ ద్వారా చెక్ చేస్తారు. ఇలా చేస్తే, చట్టపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఈ ప్రణాళిక అమలు కావాలంటే, ప్రస్తుత మద్యం చట్టాలు ప్రకారం ముఖ్యంగా Abkari Act, 1953 మరియు Foreign Liquor Rules, 1953 లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు చేయకపోతే ఆన్‌లైన్ డెలివరీ ప్రారంభం కావడం కష్టం.
ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై జాగ్రత్తగా ఆలోచిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర్లో ఉండటంతో పాటు, ప్రజల్లో వచ్చే ప్రతికూల స్పందన భయంతో వెంటనే ఆమోదం ఇవ్వడం లేదు. అందువల్ల, ఈ ప్రణాళిక అమలుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
-
Home
-
Menu