నగరంలో ఎయిర్‌టెల్, జియో సేవలు నిలిపివేత

నగరంలో ఎయిర్‌టెల్, జియో సేవలు నిలిపివేత
X
విద్యుత్ శాఖ చర్యతో హైదరాబాద్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం - ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కేబుల్ తొలగింపు – వినియోగదారుల అసహనం

హైదరాబాద్‌లో మంగళవారం భారీ స్థాయిలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రామంతపూర్‌లో జరిగిన విద్యుత్ సమస్యకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కారణమని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. దాంతో పెద్ద ఎత్తున కేబుల్ వైర్లను తొలగించారు.ఈ చర్య ఫలితంగా ఒకే రోజులో సుమారు 40 వేల ఎయిర్‌టెల్, 20 వేల జియో ఇంటర్నెట్ కనెక్షన్లు నిలిచిపోయాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో సేవలు పూర్తిగా ఆగిపోయాయి.

ఇంటర్నెట్ అంతరాయం కారణంగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్ బిజినెస్‌లు, బ్యాంకింగ్ లావాదేవీలు అంతరాయానికి గురయ్యాయి. అంతేకాక, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో మీటింగ్‌లు రద్దయ్యాయి. ప్రజలకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ చర్య తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా కేబుల్ వైర్లు అమర్చబడ్డాయి అని, భద్రత కోసమే వాటిని తొలగించాం అని తెలిపారు. అయితే సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ఇంటర్నెట్ కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక ఎయిర్‌టెల్ మరియు జియో ప్రతినిధులు మాట్లాడుతూ, కేబుల్ తొలగింపు కారణంగా సేవలు నిలిచిపోయాయి అని, మా బృందాలు ఇప్పటికే ఫీల్డ్‌లో పనిచేస్తున్నాయి,తక్షణం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కనెక్షన్లు పునరుద్ధరించే చర్యలు ప్రారంభించాం అని పేర్కొన్నారు.

ఒకే రోజులో 60 వేలకుపైగా కనెక్షన్లు నిలిచిపోవడం వల్ల నగరంలోని ప్రజలు, సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్య త్వరగా పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నా, వినియోగదారులు ముందస్తు సమాచారం లేకుండానే ఇలా సేవలు నిలిపివేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.



Tags

Next Story