దొంగనోట్ల సిరీస్ కు సీక్వెల్ రాబోతోంది !

ఇటీవల వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కథ, ఉత్కంఠభరితమైన కథనం ఉంటే.. గంటలపాటు చూసేందుకు సినీప్రియులు వెనుకాడడం లేదు. అలాంటి విజయవంతమైన వెబ్‌సిరీస్‌లలో ‘ఫర్జీ’ ఒకటి. ప్రముఖ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి తదితర నటీనటుల కాంబినేషన్‌తో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సిరీస్ కథ ఓ అసాధారణమైన పెయింటింగ్ టాలెంట్ కలిగిన యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఏదైనా పెయింటింగ్‌ను అచ్చుతప్పకుండా కాపీ చేయగల ఇతడు, దొంగ నోట్ల ముద్రణలో ఎలా అడుగుపెట్టాడన్నదే ప్రధాన ఇతివృత్తం. ఈ ఆసక్తికరమైన కథతో ‘ఫర్జీ’ ఘన విజయం సాధించడంతో, దానికి సీక్వెల్ వస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
తాజాగా, ‘ఫర్జీ 2’ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ముఖ్య నటి రాశీ ఖన్నా సీక్వెల్‌పై ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటూ ‘‘ప్రేక్షకులు ‘ఫర్జీ 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి భాగాన్ని మించి ఉత్కంఠభరితమైన ఘట్టాలు, ఆసక్తికరమైన ట్విస్టులు ఇందులో ఉండబోతున్నాయి’’ అని తెలిపారు. ‘ఫర్జీ 2’ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
-
Home
-
Menu