ఓటీటీలో ‘మార్కో’ అంతకు మించి !

మాలీవుడ్ లో గతేడాది క్రిస్మస్ సందర్భంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘మార్కో’ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ‘జనతా గ్యారేజ్, భాగమతి’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో హీరోగా అదరగొట్టాడు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి నుంచే మంచి వసూళ్లతో దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్బులోకి ప్రవేశించి.. మోహన్‌లాల్ నటించిన ‘బరోజ్’ వంటి సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది.
తెలుగులో కూడా ఈ మూవీని వారం తర్వాత విడుదల చేశారు. తొలి రోజునే అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ‘మార్కో’ రికార్డు నెలకొల్పింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేయగా, మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ వాణిజ్య పరంగా మంచి ఫలితాన్ని అందుకుంది. అయితే, సినిమాలో అధిక స్థాయిలో హింసాత్మక సన్నివేశాలు ఉండడం విమర్శలకు తావిచ్చింది. ప్రేక్షకుల్లో కొందరు ఈ దృశ్యాలను భరించలేకపోయారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇప్పటికే థియేటర్లలో వయొలెన్స్ ఎక్కువగా ఉందని అనుకున్న ప్రేక్షకులకు ఓటీటీ వెర్షన్ మరింత తీవ్రంగా అనిపించవచ్చు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ వేదికగా డిజిటల్‌గా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. హీరో ఉన్ని ముకుందన్ ముందుగా ప్రకటించినట్లుగా.. థియేట్రికల్ కట్‌లో కొంతమంది అభ్యంతరం వ్యాక్తం చేసిన దృశ్యాలను తొలగించినప్పటికీ.. వాటిని ఓటీటీ వెర్షన్‌లో జోడిస్తున్నట్టు తెలిసింది. సినిమాలోని కొన్ని హింసాత్మక దృశ్యాలు ప్రేక్షకులను కలవరపెట్టేలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. చిన్న పిల్లలు, మహిళలు, మృదువైన మనస్కులు ఈ సినిమాను అసలు చూడకూడదని నెటిజన్లు సూచిస్తున్నారు.
-
Home
-
Menu