త్వరలో ఓటీటీలోకి ‘గెట్ సెట్ బేబీ’ మూవీ !

ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘గెట్-సెట్ బేబీ’. ఈ మూవీ త్వరలో డిజిటల్‌లోకి రానుంది. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఉన్ని ముకుందన్ నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఆయన పాత్రకు న్యాయం చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ‘గెట్ సెట్ బేబీ’ మూవీ ఏప్రిల్ చివరి వారం నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఖచ్చితమైన తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వినయ్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డాక్టర్ అర్జున్ బాలకృష్ణన్ అనే ప్రసిద్ధ ప్రసూతి, గర్భధారణ నిపుణుడి జీవితాన్ని చూపిస్తుంది. తన తల్లితో ఉన్న అనుబంధం కారణంగా ఈ రంగాన్ని ఎన్నుకున్న అర్జున్, ఎంతోమందికి తల్లిదండ్రులుగా మారే అవకాశం కల్పించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటాడు.
అయితే, అతని ప్రయాణం సునాయాసంగా ఉండదు. నైతిక సంక్షోభాలు, సమాజపు ఒత్తిళ్లు, వృత్తిపరమైన సవాళ్లు ఎదుర్కొంటూ, అతని వ్యక్తిగత జీవితం కూడా ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. భార్య స్వాతి, చికిత్స పొందుతున్న ఓ మధ్యవయస్కుల జంట ఈ ఇద్దరూ అతని నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. అనుకున్నదాని ప్రకారం జీవితాన్ని నడిపించుకుంటున్న అర్జున్, అనూహ్యంగా ఎదురైన ఓ విఘాతం అతని ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితాన్ని కుదిపేస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి అన్నది మిగతా కథ. మరి ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.
-
Home
-
Menu