రచయిత ఆకెళ్ల కన్నుమూత

తెలుగు సినీ, నాటక, సాహిత్య రంగాలలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ (75) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన ఆకెళ్ల చిన్నతనం నుంచే నాటకరంగం పట్ల ఆసక్తి చూపారు. 1960లో బాలరాముడి పాత్రతో రంగస్థలంలోకి అడుగుపెట్టారు. తరువాత చందమామ, బాలమిత్ర వంటి పత్రికలకు కథలు రాయడం ద్వారా రచనా ప్రస్థానం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాటికలు, నాటకాలు, పద్యనాటకాలు రాశారు. ఆయన తొలి నాటకం ‘కాకి ఎంగిలి’ సాహిత్య అకాడమీ అవార్డును పొందడం విశేషం.
రచయితగా ఆయన సినీ ప్రస్థానం ‘మగమహారాజు’ (1983) చిత్రంతో మొదలైంది. అనంతరం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం, శ్రుతిలయలు, సిరివెన్నెల‘ వంటి క్లాసిక్ చిత్రాలకు మాటలు అందించారు. గీత రచయిత సీతారామశాస్త్రిని విశ్వనాథ్‌కు పరిచయం చేసి, ఆయనను సిరివెన్నెల చిత్రానికి పాటలు రాసేలా చేసిన ఘనత కూడా ఆకెళ్లదే.
ఆకెళ్ల రచనల్లో ఎక్కువగా మహిళల జీవితం, సామాజిక అంశాలు, చారిత్రక ఇతివృత్తాలు ప్రధానంగా కనిపిస్తాయి. ‘ఆడదే ఆధారం, శ్రీమతి ఒక బహుమతి, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా, ఎంత బావుందో’ వంటి సినిమాలతో ఆకెళ్ల మంచి పేరు సంపాదించారు. ‘అయ్యయ్యో బ్రహ్మయ్య’ సినిమాతో దర్శకుడిగానూ పనిచేశారు.
-
Home
-
Menu