కార్మికుల సమ్మె.. ఈరోజే కీలక నిర్ణయం

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల వివాదం 10వ రోజుకి చేరుకుంది. ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ సభ్యులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల అనంతరం సమ్మెపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇప్పటికే ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్.. 'బుధవారం మధ్యాహ్నం జరిగే చర్చల్లో అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు. గత సోమవారం తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్మాతలతో, ఫెడరేషన్ నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో అన్ని షూటింగ్స్ నిలిచిపోయాయి. నిర్మాతలు ఇటీవల వేతనాల పెంపుపై కొన్ని షరతులు విధించారు. అందులో ఎక్కువ మంది కార్మికుల వేతనాలు (రోజుకు రూ. 2000 లోపు ఉన్నవారికి) పెంచడానికి ఒప్పుకున్నారు. అయితే, రోజువారీ రూ. 2000 కంటే ఎక్కువ వేతనాలు పొందే డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ యూనియన్లకు పెంపు ఇవ్వలేదు.
దీని పట్ల ఫెడరేషన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'ఈ మూడు యూనియన్లకు కూడా వేతనాలు పెంచితేనే సమ్మె విరమణ చేస్తాం. మిగతా కండీషన్లను దశల వారీగా అమలు చేయడంలో మేము అంగీకరిస్తాం' అని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
ఈరోజు జరిగే ఫెడరేషన్–ఫిల్మ్ ఛాంబర్ చర్చల ఫలితంపై ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా దృష్టి సారించింది. సమ్మె విరమణకు మార్గం సుగమమవుతుందా, లేక ఉద్రిక్తత కొనసాగుతుందా అన్నది ఈరోజు సాయంత్రం తేలనుంది.
-
Home
-
Menu