'హిట్ 3' ఆల్ఫా ఎవరో తెలుసా?

'హిట్ 3: ది థర్డ్ కేస్' చిత్రంలో ఆల్ఫా అనే సైకో విలన్ పాత్రతో ప్రేక్షకుల్ని భయపెట్టిన నటుడు ప్రతీక్ బబ్బర్. అమాయకుల్ని మాయ చేసి, హత్యలు చేయించే ఆ క్రూర పాత్రను ఎంతో సహజంగా పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రతీక్. ఇంతకీ ప్రతీక్ బబ్బర్ ఎవరో తెలుసా? బాలీవుడ్ నటులు రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ దంపతుల తనయుడు.
స్మితా పాటిల్ 80వ దశకంలో భారత సినిమాను తన అభినయంతో ఓ కొత్త స్థాయికి తీసుకెళ్లిన నటీమణి. గ్లామర్‌కన్నా, సహజత్వంతో కూడిన పాత్రలతో రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్న నటీమణి. ‘శక్తి, అర్ధ్ సత్య, మిర్చ్ మసాలా’ వంటి సినిమాల్లో తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులు అందుకుంది. చిన్న వయసులోనే పద్మశ్రీ పురస్కారాన్ని సైతం పొందింది. అయితే.. 31 సంవత్సరాల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూసింది స్మితా పాటిల్.
ప్రతీక్ తండ్రి రాజ్ బబ్బర్.. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. అలాంటి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రతీక్.. గడిచిన ఒకటిన్నర దశాబ్దంగా బాలీవుడ్ లో పలు చిత్రాలు చేశాడు. ఇప్పుడు 'హిట్ 3'తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. మరి.. 'హిట్ 3' తర్వాత ప్రతీక్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.
-
Home
-
Menu