'వీరమల్లు' ప్లేసులో ఆ రెండు!

పవన్ కళ్యాణ్ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' మొదట మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా, తర్వాత మే 9కి వాయిదా పడింది. మే 9న గతంలో చిరంజీవి బ్లాక్‌బస్టర్స్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్' వంటి చిత్రాలు వచ్చి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అదే సెంటిమెంట్‌తో ఆ డేట్ కు 'వీరమల్లు'ని తీసుకొద్దామనుకున్నారు.
అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, పవన్ కళ్యాణ్ రాజకీయ కట్టుబాట్ల కారణంగా కీలక సన్నివేశాల చిత్రీకరణ పెండింగ్‌లో ఉండటంతో ఈ చిత్రం మే 9న విడుదల కావడం సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విడుదల తేదీని మెగాస్టార్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ కు వాడేస్తున్నారు. అలాగే శ్రీవిష్ణు నటించిన '#సింగిల్', సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' చిత్రాలు ఈ మెగా డేట్ ను ఉపయోగించుకుంటున్నాయి.
శ్రీవిష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మూవీ 'సింగిల్'. 'హరి హర వీరమల్లు' వాయిదా వార్తలు వెలువడిన వెంటనే, ఈ చిత్ర బృందం మే 9ని 'సింగిల్' చిత్రం విడుదల ఖరారు చేసి, ప్రమోషన్‌లను వేగవంతం చేసింది. ఈ తేదీన ఇతర పెద్ద చిత్రాల పోటీ లేకపోవడం, వేసవి సెలవుల సీజన్ కావడం వంటి అంశాలు 'సింగిల్'కి అనుకూలంగా ఉన్నాయి.
మరోవైపు సమంత 'శుభం' కూడా మే 9న వస్తోంది. సమంత నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత, 'శుభం' చిత్రంతో నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. 'హరి హర వీరమల్లు' వాయిదా పడిన సమయంలో, సమంత ఈ తేదీని ఎంచుకోవడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా భావించబడుతోంది. మరి.. మెగా డేట్ మే9 శ్రీవిష్ణు, సమంతలకు ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.
-
Home
-
Menu