‘అదుర్స్‘ హంగామా మళ్లీ రాబోతుందా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా ‘మ్యాడ్ స్క్వేర్‘ సక్సెస్ ఈవెంట్ లో ‘దేవర 2‘తో పాటు.. తన మరో చిత్రం ‘అదుర్స్ 2‘ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌లో ఒక బిగ్ హిట్ అయిన ‘అదుర్స్‘ సినిమా గురించి మాట్లాడుతూ, ‘కామెడీ పండించడం చాలా కష్టం. అందుకే ‘అదుర్స్ 2‘ చేయాలా వద్దా అన్న గందరగోళంలో ఉన్నా‘ అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో అభిమానులు ఈ సీక్వెల్ పై మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2009లో విడుదలైన ‘అదుర్స్‘ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, మాస్ మసాలా, యాక్షన్, కామెడీ కలగలసి ప్రేక్షకులను అలరించింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఆకట్టుకున్నాడు. వీటిలో ఒకటి సీరియస్ గా కనిపించే నరసింహ పాత్ర కాగా, మరొకటి ఆహ్లాదంగా నవ్వించే, ఉల్లాసంగా తిరిగే చారి పాత్ర.
‘అదుర్స్‘ సూపర్ హిట్ అవ్వడంతో ‘అదుర్స్ 2‘ చేయాలి అని తారక్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. లేటెస్ట్ గా ‘మ్యాడ్ స్క్వేర్‘ ఈవెంట్ లో ‘అదుర్స్ 2‘ గురించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఈ క్రేజీ సీక్వెల్ గురించి చర్చ నెట్టింట జోరుగా జరుగుతుంది.
-
Home
-
Menu