లాంగ్ గ్యాప్ తీసుకోనున్న వెంకీ .. కారణం ఇదేనా?

తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌ను అందుకున్నారు సీనియర్ స్టార్ వెంకటేష్ . "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రంతో ఆయన మరోసారి తన సత్తా చాటుకున్నారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సరైన కంటెంట్ ఉంటే.. ఆయన ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద బలమైన హీరోగా నిలవగలరని ఈ చిత్రం నిరూపించింది. ఇంతకు ముందు... వెంకటేష్‌కు సోలోగా పెద్ద హిట్ రావడమే కష్టమయ్యింది. ముఖ్యంగా "సైంధవ" వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించ లేకపోయాయి.
మరో హీరో సపోర్ట్ లేకుండా వెంకటేష్ బ్లాక్‌బస్టర్ అందుకోగలరా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం అందరి నోళ్ళను మూయించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్లు వసూలు చేసి విమర్శకులను మౌనంగా మార్చింది. ఇంతటి ఘన విజయం సాధించినప్పటికీ, ఆయన తదుపరి సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకు ప్రధాన కారణం వెంకటేష్‌కు మోకాళ్ల సమస్య ఉండటమే.
ఆయన కొంతకాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్లు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, ఆయన సమ్మర్ సీజన్ తరువాతే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం అభిమానులు ఆయన కొత్త ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత వెంకటేష్ తన కొత్త సినిమాను ప్రకటించే అవకాశముందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
-
Home
-
Menu