ఈ వారం బాక్సాఫీస్ పోటీ!

ఈ వారం బాక్సాఫీస్ పోటీ!
X

ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. గత వారం అయితే 10కి పైగా చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే వాటిలో 'ఛావా' ఒక్కటే నిలబడింది. ఇక ఈ వారం మరికొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి.



నేచురల్ స్టార్ నాని నిర్మించిన 'కోర్ట్' ఈ వారం వస్తోన్న చిత్రాలలో ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ చిత్రంలో ప్రియదర్శి, శివాజీ, రోహిణి, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. పోక్సో చట్టంలోని లోపాలు, దుర్వినియోగాన్ని ప్రస్తావిస్తూ రూపొందిన ఈ చిత్రం కంటెంట్ బేస్డ్ మూవీగా కనిపిస్తోంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా, కమర్షియల్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి ఉంది.



కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రుబా’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించగా, విశ్వ కరుణ్ దర్శకత్వం వహించాడు. గతంలో ‘క’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఈసారి మరింత నమ్మకంగా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. కథా బలం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అతనికి నమ్మకం.



మళయాలంలో హిట్ అయిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఈ వారం తెలుగులో విడుదలవుతోంది. కుంచకో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాఖ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జితూ అష్రఫ్ డైరెక్ట్ చేశాడు. మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' తెలుగు ప్రేక్షకుల్ని ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.




2010లో వచ్చిన కార్తీ, రీమా సేన్, ఆండ్రియా నటించిన ‘యుగానికి ఒక్కడు’ ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది. తమిళ చారిత్రక రాజ్యాలైన చోళులు, పాండ్యుల కథకు.. మోడర్న్ కాలానికి లింక్ పెడుతూ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే, ఇప్పటి థియేటర్ ప్రేక్షకులను ఇది ఎంతవరకు ఆకర్షించగలదో ఆసక్తిగా మారింది.






Tags

Next Story