తెలుగు బాక్సాఫీస్‌లో డబ్బింగ్ సినిమాల హవా!

ఈ వారాంతం టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్లీ కొత్త ఆశలు పెంచే సమయం. గత వారం విడుదలైన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో సినీ ప్రియుల దృష్టి మార్చి 7న విడుదలకానున్న సినిమాలపైనే నిలిచింది. ఆశ్చర్యకరంగా, ఈసారి ఏకంగా పది సినిమాలు బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతున్నాయి.
బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘ఛావా’ తెలుగులో మూడు వారాల ఆలస్యంగా విడుదల కానుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడంతో తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకర్షించగలదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'కింగ్‌స్టన్' మూవీ ఈ వారంలో వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నితిన్ అతిథిగా హాజరయ్యాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో 'కింగ్‌స్టన్'పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
మలయాళంలో హిట్ అయిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ అదే పేరుతో డబ్బింగ్ అయ్యింది. కుంచకో బోబన్, ప్రియమణి నటించిన ఈ చిత్రం థ్రిల్లర్ జానర్‌లో వచ్చి మాలీవుడ్ లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే అంచనాలున్నాయి.
తెలుగు నుంచి 'నారీ, రారాజు, పౌరుషం, వైఫ్ ఆఫ్ అనిర్వేష్, శివంగి, 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్' వంటి సినిమాలు కన్నడ నుంచి 'రాక్షస' వంటి చిత్రం కూడా ఈ వారం విడుదల జాబితాలో ఉన్నాయి. మొత్తంగా ఈ వారం విడుదలవుతోన్న చిత్రాలలో అనువాద సినిమాలదే పై చేయిగా కనిపిస్తుంది
-
Home
-
Menu