సమ్మర్ బాక్సాఫీస్.. స్టార్ మూవీస్ ఎక్కడ?

సమ్మర్ బాక్సాఫీస్.. స్టార్ మూవీస్ ఎక్కడ?
X

సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాలు ప్రధానంగా ఫోకస్ పెట్టేది సమ్మర్. కాలేజీలకు సెలవులుండటంతో యువత సినిమాలకు భారీగా వస్తుంది. ఈ సమయంలో మంచి సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అందుకే ప్రతీ వేసవికీ పెద్ద, మీడియం రేంజ్ సినిమాల హడావుడి కనిపించడం సహజం. కానీ ఈసారి మాత్రం పెద్ద సినిమాల కొరత కనిపిస్తోంది. కొన్ని పెద్ద సినిమాలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతున్నాయి.

అసలు సంక్రాంతికి విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ ముందుగా మే 9న వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆ సమయానికి కూడా విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ కోసం రామ్ చరణ్ ఫోకస్ పెట్టడంతో చిరు సినిమా వెనక్కి వెళ్లింది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ ఆగస్టు వరకూ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విషయానికి వస్తే, ఈ సినిమా మూడేళ్లుగా వాయిదా పడుతూనే ఉంది. మార్చి 28న వస్తుందనే వార్తలు వచ్చినా, ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. అడపాదడపా ప్యాచ్ వర్క్ చేస్తూనే ఉన్నప్పటికీ, కొన్ని కీలకమైన సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు కూడా పెద్దగా మిగిలే ఉన్నాయి. దీంతో ఈ సినిమా వేసవిలో విడుదల అవుతుందనే గ్యారంటీ లేదు. మే లేదా జూన్ లో కూడా రావడం కష్టమేనని అంటున్నారు.

ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి కూడా నిరాశే ఎదురవుతోంది. ఇంకా రెండు పాటలు, కొంత టాకీ భాగం మిగిలి ఉంది. ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేస్తారని భావించినప్పటికీ, తాజా పరిస్థితుల ప్రకారం అది సాధ్యపడేలా లేదు. జూన్ లేదా జులైలో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

ఈ వేసవిలో ఈ మూడు ప్రధాన సినిమాలూ నిలిచిపోతే, పెద్ద సినిమాల సందడి లేకుండా పోయినట్టే. ఒకవేళ అదే జరిగితే గత ఏడాది వేసవిని పెద్ద సినిమాలు ఉపయోగించుకోలేనట్టే.. ఈ ఏడాది వేసవి కూడా పెద్ద సినిమాలు లేక బాక్సాఫీస్ వెలితిగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలో మీడియం రేంజ్ మూవీస్ కు మంచి అవకాశం కూడా. చిన్న, మధ్య తరహా చిత్రాలకు పెద్దగా పోటీ లేకపోవడం వల్ల, వీటికి మంచి వసూళ్లు రావొచ్చు. మరి ఈ వేసవిని మీడియం సినిమాలు ఎలా ఉపయోగించుకుంటాయో చూడాలి.

Tags

Next Story