ఆ పెద్ద ప్రాజెక్ట్ కోసం చాలా ఆశపడ్డాను : శ్రీనిధి శెట్టి

‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ శ్రినిధి శెట్టి. ఇప్పుడు ఆమె తొలిసారిగా తెలుగులోకి అడుగుపెడుతోంది. నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ ద్వారా ఆమె టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రచార కార్యక్రమాల సందర్భంగా శ్రినిధి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ... “బాలీవుడ్‌లో ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం చాలా ఆశపడ్డాను. నా స్క్రీన్ టెస్ట్ చూసిన తర్వాత వారు సంతృప్తి చెందినట్టు చెప్పారు. కానీ చివరికి అవకాశం ఇవ్వలేదు” అని చెప్పింది. శ్రినిధి చెప్పిన ప్రాజెక్ట్ ఏంటంటే.. నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘రామాయణం’. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. శ్రినిధి కూడా సీత పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్ ఇచ్చిందట. అయితే ఆమెను ఎందుకు ఎంపిక చేయలేదో ఆమెనే చెబుతోంది.
“నాకు ఆ పాత్ర ఇవ్వలేదు. ఎందుకంటే ‘కేజీఎఫ్’లో యశ్ తో జంటగా నటించాను. అదే యష్ ఇప్పుడు రామాయణంలో రావణుడిగా నటిస్తున్నాడు. ఒకే స్క్రీన్‌పై ముందుగా ప్రేమ జంటగా కనిపించిన ఇద్దరిని, తర్వాత ఒకరు రాముడిగా, మరొకరు రావణుడికి విరుద్ధంగా ఉండే పాత్రలో చూడటాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చు అని మేకర్స్ భావించారట” అని చెప్పింది శ్రినిధి.
అయితే ఆమె పాజిటివ్‌గా స్పందిస్తూ .. “సాయి పల్లవి లాంటి నటికి అలాంటి పాత్ర దక్కినందుకు ఆనందంగా ఉంది. ఆమె నిజంగా ఆ పాత్రకి తగిన వ్యక్తి” అని ప్రశంసించింది. ఇక ‘హిట్ 3’ తర్వాత, శ్రినిధి మరో తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ అనే చిత్రంలో ఆమె ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
శ్రినిధి శెట్టి ఇప్పటివరకు కన్నడ పరిశ్రమలో తన ప్రతిభను చూపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలవాలన్న ఆశయంతో ముందుకు వస్తోంది. బాలీవుడ్ అవకాశం దక్కకపోయినా, ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కొత్త అవకాశాల కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తానని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీకి శ్రినిధి శెట్టి లాంటి ప్రతిభావంతురాలు వచ్చిందంటే.. ప్రేక్షకులదే ఆ గెలుపు.
-
Home
-
Menu