‘ఎంపురాన్’ తెలుగు రీమేక్ సాధ్యమేనా?

మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘యల్ 2 : ఎంపురాన్’ ఒకటి. ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్న ఒక ముఖ్యమైన అంశం దాని తెలుగు రీమేక్ చేసే అవకాశమే. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ను ‘గాడ్‌ఫాదర్’గా తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం తెలుగులో ఓ మోస్తరు విజయం సాధించినప్పటికీ, మలయాళంలో వచ్చిన రేంజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన ఎంతోమందికి ఆసక్తికరంగా అనిపించినా.. అది జరిగే అవకాశాలు లేవనే చెప్పాలి. చిరంజీవి ఇప్పటికే రీమేక్ చేసిన చిత్రానికి సీక్వెల్‌ను మళ్లీ రీమేక్ చేయడానికి సిద్ధపడటం దాదాపు అసాధ్యమే. దీనికి తోడు, ‘గాడ్‌ఫాదర్’ చిరంజీవికి ఆశించిన స్థాయిలో పెద్ద విజయాన్ని అందించలేదు. కేవలం ఓ మోస్తరు విజయం మాత్రమే దక్కింది. ఇది కూడా రీమేక్ అవకాశాన్ని తగ్గించే అంశమే.
ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘గాడ్‌ఫాదర్’ను చూసిన విషయాన్ని గుర్తుచేసుకొని, ఈ సినిమా సీక్వెల్‌ను తెలుగులో రీమేక్ చేయడం సాధ్యమయ్యేలా కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. దీనికి ప్రధాన కారణం, ‘లూసిఫర్’లో కీలక పాత్రలు కొన్ని ‘గాడ్‌ఫాదర్’లో తొలగించబడటం. ఇప్పుడు ఆ పాత్రలు ‘ఎంపురాన్’ కథలో కీలకంగా మారడంతో, తెలుగు రీమేక్‌కు మౌలికమైన పునాది లేదని స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల, ‘ఎంపురాన్’కు తెలుగులో రీమేక్ చేసే అవకాశాలు లేవని తేల్చిచెప్పొచ్చు.
-
Home
-
Menu