గద్దర్ అవార్డుల విశేషాలు!

గద్దర్ అవార్డుల విశేషాలు!
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'గద్దర్ అవార్డులు' ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 2013 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను కొనసాగించకపోవడం వల్ల అనేకమంది సినీ వ్యక్తులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ లోటును పూరిస్తూ, గత సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి గౌరవించనుంది.

మార్చి 13వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, అవార్డుల విభజన కూడా విస్తృతంగా జరగనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాకుండా, ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత ప్రతిబింబించే చిత్రం, బాలల చలనచిత్రం, పర్యావరణ పరిరక్షణ, వారసత్వ సంపద (హెరిటేజ్), చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రదానం చేయనున్నారు.

అంతేకాదు, తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, సామాజిక ప్రభావం కలిగిన సినిమా, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ విభాగాల్లోనూ ఈ పురస్కారాలు లభించనున్నాయి. సినిమాపై రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు, పుస్తకాలు, పరిశ్రమలో కీలక పాత్ర పోషించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకూ గౌరవాన్ని అందించనున్నారు. తెలంగాణకు సంబంధించిన పైడి జయరాజ్‌, కాంతారావు, ఎం.ప్రభాకర్‌రెడ్డి పేర్లతోనూ అవార్డులు కొనసాగించాలని నిర్ణయించింది.

Tags

Next Story