రాజమౌళి.. ఇండియన్ సినిమాకి మిడాస్ టచ్ : అనురాగ్ కశ్యప్

ఎస్.ఎస్. రాజమౌళి... భారతీయ సినిమా రంగంలో అతను ఒక బ్రాండ్. ‘మగధీర, ఈగ, బాహుబలి’ ప్రాంచైజీ, ‘ఆర్ఆర్ఆర్’ వంటి అద్భుత చిత్రాలతో ఆయన నిర్మించిన ప్రమాణాలు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఆయన దర్శకత్వ శైలి, చిత్ర నిర్మాణం పట్ల ఉన్న అభిరుచి అనేక మంది దర్శకులకు స్ఫూర్తిగా మారింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా రాజమౌళికి వీరాభిమానిగా నిలిచారు.
ఇటీవల నాగార్జున స్థాపించిన అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో అనురాగ్ మాట్లాడారు. "రాజమౌళిని అనుకరించే పదిమంది ఉన్నా, ఆయన మాయాజాలాన్ని పునరావృతం చేయలేకపోయారు" అని పేర్కొన్నారు. "ఒక దర్శకుడిని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్కరూ తమ స్వంత శైలి, ముద్ర కలిగి ఉండాలి. ఎన్నో సినిమాలు చూడాలి. అవి వ్యక్తిగత శైలిని ఏర్పరచుకోవడానికి తోడ్పడతాయి" అని అనురాగ్ విద్యార్థులకు సూచించారు.
ఇదే సందర్భంలో ఆయన ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘కేజీఎఫ్’ సినిమాను అనుకరించే చాలా మంది దర్శకులు విఫలమైన విషయాన్ని ప్రస్తావించారు. "పాన్-ఇండియా ట్రెండ్ కొత్తది కాదు. 90వ దశకంలో చిరంజీవి ‘పృతిబంధ్’, నాగార్జున ‘శివ’ వంటి చిత్రాలు కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు ఈ పాన్-ఇండియా ట్రెండ్ అనేకమంది దర్శకులకు గోల్డెన్ పాత్ గా మారింది" అని అన్నారు.
అనురాగ్ వ్యాఖ్యలు పూర్తిగా నిజమే. ‘బాహుబలి, కేజీఎఫ్’ ట్రెండ్‌ను అనుసరించి తీసిన కొన్ని చిత్రాలు వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఉపేంద్ర నటించిన ‘కబ్జ’, విజయ్ నటించిన ‘పులి’ లాంటి సినిమాలు ‘బాహుబలి, కేజీఎఫ్’ శైలిలో తీసినట్లు అనిపించినా, ప్రేక్షకులు వాటిని తిరస్కరించారు. ఇవన్నీ రాజమౌళి స్థాయిని మరోసారి నిదర్శనంగా నిలిపాయి. "బాహుబలి చూసిన తర్వాతే ‘పొన్నియిన్ సెల్వన్’ తీసే ఆలోచన వచ్చిందని" లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం స్వయంగా చెప్పడం కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తుంది.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్న భారీ సినిమా కోసం రూ. 1,000 కోట్ల బడ్జెట్ కేటాయించబడింది. భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దర్శకుల్లో రాజమౌళి అగ్రస్థానంలో నిలిచారు.
-
Home
-
Menu