అమరావతిలోనూ బసవతారకం కేన్సర్ హాస్పిటల్ !

టాలీవుడ్ సీనియర్ నటుడు, తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. గతంలోనే హైదరాబాద్‌లో ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఒక హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఈ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బసవతారకం హాస్పిటల్ వెండి జయంతి ఉత్సవాల సందర్భంగా, అమరావతిలో తొలి దశలో 300 పడకలతో కూడిన క్యాన్సర్ హాస్పిటల్‌ను త్వరలో ప్రారంభిస్తామని బాలయ్య ధృవీకరించారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను లాభాల కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం స్థాపించలేదని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారికి సరసమైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని బాలకృష్ణ తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో మరణించడం వల్ల ఈ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. 110 పడకలతో చిన్నగా ప్రారంభమైన ఈ హాస్పిటల్, ఆధునిక వైద్య సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలతో ఒక పెద్ద హాస్పిటల్‌గా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అందించిన మద్దతుకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహకు కూడా ధన్యవాదాలు చెప్పారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అమరావతిలో తొలి దశలో 300 పడకలతో హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో దీన్ని అన్ని ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలతో విస్తరిస్తామని తెలిపారు. అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటుకు విరాళాలు అందించిన వారందరినీ ఆయన ప్రశంసించారు.
-
Home
-
Menu