ఏకంగా ఏడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ?

ఇప్పటివరకూ టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న కథానాయికగా రాజీలేని ప్రస్థానం సాగించిన అందాల అనుష్క శెట్టి.. ఇప్పుడు తెరపై కనిపించడమే అరుదుగా మారింది. ‘బాహుబలి’ లో దేవసేనగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన తర్వాత, 2020 లో ‘నిశ్శబ్ధం’, 2023 లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమా తర్వాత మళ్లీ మౌనంలోకి వెళ్లిపోయింది. అంతలోనే ఒక్కసారిగా సంచలన వార్తలు సోషల్ మీడియా వేదికగా వచ్చిపడ్డాయి. అనుష్క ఏకంగా ఏడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఈ వార్త ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె ఏడు కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పిందని ప్రచారం. వాటిలో ‘ఘాటి’ అనే తెలుగు సినిమా, మలయాళంలో రూపొందుతున్న పురాణ కథా చిత్రం ‘కత్తనార్’ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మిగిలిన ఐదు ప్రాజెక్టుల విషయంలో అయితే పూర్తి గోప్యత పాటించమని అనుష్క స్వయంగా నిర్మాతలకు సూచించిందట. ప్రమోషన్లు మొదలయ్యే వరకు ఎలాంటి వివరాలు బయటకు రాకూడదని చెప్పిందని టాక్.
అనుష్క కెరీర్ మొత్తానికీ చూస్తే.. ఆమె ఎప్పుడూ సాహసోపేతమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్లింది. ‘అరుంధతి’ నుంచి ‘సైజ్ జీరో’ వరకు ఆమె చేసిన ప్రయోగాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రభాస్‌తో స్క్రీన్ మీద జతకట్టబోతున్నారన్న వదంతులు కూడా అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ఆ వార్త నిజమా కాదా అన్నది పక్కనపెడితే.. ఆమె తిరిగివచ్చే పంథా మాత్రం చాలా మెల్లిగా, నిశ్శబ్దంగా, కానీ దృఢంగా సాగుతోందని స్పష్టంగా కనిపిస్తోంది.
అంతగా ప్రచారానికి పోకుండా.. తన పనితనంతోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలన్న అనుష్క ఆలోచన, ఈ రోజుల్లో అత్యంత అరుదైనది. అధికారికంగా ఈ ప్రాజెక్టుల గురించి ప్రకటించనప్పటికీ, ఆమె అభిమానులు మాత్రం భారీ రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే, ఈ మౌనమే అనుష్క తిరిగి వస్తున్న దారిని మరింత ఆసక్తికరంగా, రహస్యంగా మార్చేస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.
-
Home
-
Menu