బాలీవుడ్ కు మరో తెలుగు బ్యూటీ ?

బాలీవుడ్ కు మరో తెలుగు బ్యూటీ ?
X
అనన్య నాగళ్ల తన సినీ ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమయ్యింది. ఇప్పుడు ఆమె దృష్టి బాలీవుడ్ మీద పడింది. హిందీ తెరకు తన పరిచయాన్ని ఒక భిన్నమైన కథ ద్వారా చేయబోతోంది ఈ తెలుగు నటి.

టాలీవుడ్ లో నటనా ప్రాధాన్యమున్న పాత్రలు, కథల ఎంపికతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటీమణి అనన్య నాగళ్ల. సహజమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. ఆమె తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ‘మల్లేశం’ సినిమాలో పదునైన భావోద్వేగాలతో, నిండైన పాత్రలో మెరిసిన అనన్య, ‘వకీల్‌సాబ్‌’ వంటి కమర్షియల్ విజయం సాధించిన చిత్రంలోనూ తనదైన ముద్ర వేసింది. నటనకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాల ఎంపికలో ఆమె చూపిన ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి.

ఇలాంటి తరుణంలో అనన్య నాగళ్ల తన సినీ ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమయ్యింది. ఇప్పుడు ఆమె దృష్టి బాలీవుడ్ మీద పడింది. హిందీ తెరకు తన పరిచయాన్ని ఒక భిన్నమైన కథ ద్వారా చేయబోతోంది ఈ తెలుగు నటి. ఈ క్రమంలో ఏక్తా ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హిమ్మత్ లడుమోర్‌ నిర్మించనున్న ఓ నాయికా ప్రాధాన్య చిత్రం ఆమెకు బాలీవుడ్‌లో తొలి అవకాశం ఇచ్చింది. ఈ సినిమాకు రాకేశ్‌ జగ్గి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఇందులో అనన్య ఒక గిరిజన యువతిగా కనిపించనుంది. అంటే పూర్తిగా డీగ్లామర్ పాత్ర ఇది.

ఈ పాత్ర కోసం అనన్య ప్రత్యేకమైన ప్రిపరేషన్‌కు దిగినట్లు సమాచారం. గిరిజన సంస్కృతి, జీవనశైలి, దినచర్యలపై అధ్యయనం చేసిన ఆమె, ఆ పాత్రను ఆత్మసాత చేసేందుకు ప్రత్యేక శ్రమ తీసుకుందట. ఆమె నటనకు ఇది మరో పరీక్షగా మారనుంది. తెలుగు ప్రేక్షకులే కాదు, బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే అవకాశం ఈ చిత్రంతో అనన్యకు లభించనుంది.

ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశముంది. కథ, ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. అనన్య నటిస్తున్న పాత్ర, ఆమె పాత్ర పరిధి, కథలోని వైవిధ్యం వంటి అంశాలు ఇప్పటికే బాలీవుడ్ సర్కిల్స్‌లో ఆసక్తిగా మారాయి.

Tags

Next Story