సినీ అవార్డుల చరిత్రలో కొత్త అధ్యాయం

సినీ అవార్డుల చరిత్రలో కొత్త అధ్యాయం
X

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'గద్దర్ అవార్డులు' అందజేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివరాలను తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు.

ఈ అవార్డుల విషయానికొస్తే.. ప్రముఖ సినీ వ్యక్తులను గౌరవించే ఉద్దేశ్యంతో పైడి జయరాజ్, కాంతారావు పేరుతో ప్రత్యేక అవార్డులు అందజేయనున్నారు. తెలుగు సినిమాలతో పాటు ఉర్దూ చిత్రపరిశ్రమను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఉత్తమ ఉర్దూ సినిమాకు ప్రత్యేక అవార్డు ఇవ్వనున్నట్లు దిల్‌రాజు వెల్లడించారు.

2014 జూన్ నుండి 2023 డిసెంబర్ వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ప్రదానం చేయనున్నట్లు స్పష్టం చేశారు. 2024 సంవత్సరానికి సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులతో గతంలో అమలైన అవార్డుల విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

సినిమా అవార్డులను వివాదాస్పదం చేయకుండా, అందరూ సానుకూలంగా స్వీకరించి విజయవంతం చేయాలని దిల్‌రాజు కోరారు. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags

Next Story