తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి!

తమిళనాడులో హిందీ భాషపై కొనసాగుతున్న రాజకీయ వివాదానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భాషలు, సంస్కృతిపై వైఖరులు, వాటిని అంగీకరించే విధానం గురించి ఆయన తనదైన శైలిలో స్పందించారు.
పవన్ కళ్యాణ్ అభిప్రాయానుసారం, దేశంలోని భాషలన్నీ సమానమేనన్న భావన అందరిలో ఉండాలి. తమిళనాడు హిందీని వ్యతిరేకిస్తూనే, తమ సినిమాలను హిందీలోకి డబ్ చేసి ఉత్తర భారత దేశంలోని మార్కెట్‌ను ఆశ్రయించడం ద్వంద్వ వైఖరి అవుతుందన్నారు. 'హిందీ మాట్లాడకూడదు, సంస్కృతాన్ని తొక్కిపెట్టాలి అని ఒకపక్క అంటారు.. కానీ తమ పరిశ్రమలకు హిందీ ప్రాంతాల నుండి ఆదాయం రావాల్సిందేనని కోరతారు. ఇది ఎక్కడి న్యాయం?' అని ఆయన ప్రశ్నించారు.
అలాగే, భాషల పట్ల ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదని, భిన్నతలను అంగీకరించడమే సమతుల్యతకు దారి తీస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ముస్లింలు ఎక్కడి వారైనా అరబిక్ లేదా ఉర్దూలో ప్రార్థనలు నిర్వహిస్తారని, అదే విధంగా హిందూ ధర్మంలో సంస్కృతం మంత్రాలకు పునాదిగా ఉంటుందని అన్నారు. 'ఇప్పుడు ఆలయాల్లో తెలుగులో లేదా తమిళంలో మంత్రాలు చదవాలా?' అంటూ ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు.
భాషల పరంగా వివాదాలు కాకుండా, దేశ సమగ్రతను గుర్తించి అవన్నీ భారతీయ సంస్కృతిలో భాగమేనని అంగీకరించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో మళ్లీ హిందీ భాష చర్చనీయాంశంగా మారిన వేళ, పవన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
-
Home
-
Menu