తొలి ఏఐ ఆధారిత సినిమా వచ్చేస్తోంది !

ఇప్పటి సాంకేతికత తన సొంత సినిమాను రూపొందించుకుంటోంది. అంటే.. చిత్రకారుడి బ్రష్ తన స్వంత కళాఖండాన్ని సృష్టించినట్లే లెక్క. ప్రస్తుతం డీప్‌ఫేక్‌లు, ఏఐ క్రియేట్ చేసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లోకి విస్తృతంగా ప్రవేశిస్తున్న కాలంలో.. కృత్రిమ మేధస్సు ఇప్పుడు సినిమాలను రూపొందించే స్థాయికి ఎదిగింది. ఏఐ వల్ల కలిగే లాభనష్టాలపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఇది అన్ని రంగాలను మార్చేస్తున్నదనేది స్పష్టమే, ముఖ్యంగా సినిమా రంగాన్ని.
ఇంతకాలం సినిమాను తెరపైకి తీసుకురావడం అంటే భారీ ఖర్చులు, క్రియేటర్స్ ను తెరపైకి తీసుకొచ్చే అతి కష్టమైన పనిగా ఉండేది. అయితే.. ఇప్పుడు దృశ్యం మారుతోంది. దర్శకుడిగా ఏఐ భాద్యతలు చేపడుతోంది. దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నది ‘నైషా’ భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత సినిమా. జైన్ కపూర్, ఏఐ సృష్టించిన నటి నైషా బోస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం.. సాంకేతికత తనే కథానాయికగా మారుతున్న యుగానికి నాంది పలుకుతోంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. విజువల్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా, నటన సైతం సహజంగా అనిపించడంతో, ఇది పూర్తిగా ఏఐ చేత రూపొందించబడిందనే విషయం మొదట గుర్తించలేకపోయారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంప్రదాయ చిత్ర నిర్మాణాన్ని ఏఐ ఏమేరకు మించగలదో పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. మే 2025లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
‘నైషా’ విజయం సాధిస్తే, భవిష్యత్తులో కథలు రాయడం, సినిమాలను దర్శకత్వం వహించడం, నటించడం వంటి ప్రతి అంశాన్ని కూడా ఏఐ చేపట్టే రోజు వస్తుందా? లేక ఇది కేవలం దర్శకులకు సహాయక ఉపకరణంగా మాత్రమే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం సమయం మాత్రమే చెప్పగలదు.
-
Home
-
Menu