బాక్సాఫీస్‌కు పండగ సమయం!

వేసవి సీజన్‌కు ముందే సినిమా థియేటర్లు కళకళలాడనున్నాయి. ఈసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా, తెలుగు సంవత్సరాది ఉగాది మరియు రంజాన్ పండుగలు వరుసగా రావడం సినీ రంగానికి సువర్ణావకాశంగా మారింది.
ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు పలు భారీ, విభిన్న కథాంశ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈకోవలో ముందుగా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 'ఎల్2: ఎంపురాన్'. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో.. మరో స్టార్ పృథ్వీరాజ్ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రమిది. మాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్'కి సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. పాన్ ఇండియా లెవెల్ లో 'ఎంపురాన్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
విలక్షణ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచే విక్రమ్ కు సరైన హిట్టొచ్చి చాన్నాళ్లే అయ్యింది. అయినా సినిమా, సినిమాకీ పాత్రల ఎంపికలో విలక్షణంగానే దూసుకెళ్తున్నాడు చియాన్. ఈసారి విక్రమ్ 'వీర ధీర శూర 2' అంటూ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మొదటి భాగం విడుదలవ్వకుండానే సెకండ్ పార్ట్ తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి స్పందన వచ్చింది.
ఈనెలలో పండగ కానుకగా ముందుగా అనువాదాలు వస్తుంటే.. ఒక రోజు ఆలస్యంగా తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. నితిన్, వెంకీ కుడుముల కాంబోలో 'భీష్మ' వంటి హిట్ తర్వాత రాబోతున్న సినిమా 'రాబిన్‌హుడ్'. ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్ జోరుగా నిర్వహిస్తుంది టీమ్. నితిన్ కి జోడీగా శ్రీలీల నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'రాబిన్‌హుడ్' మార్చి 28న విడుదలవుతుంది.
సితార సంస్థ నుంచి పూర్తి స్థాయి వినోద భరిత చిత్రంగా వస్తోంది 'మ్యాడ్ స్క్వేర్'. ఇప్పటికే సూపర్ హిట్టైన 'మ్యాడ్'కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 28న ఉగాది పండగ కానుకగా 'మ్యాడ్ స్క్వేర్' థియేటర్లలోకి వచ్చేస్తుంది.
-
Home
-
Menu