'ది రిచెస్ట్ చిల్లర్ గయ్' వచ్చేశాడు!

టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. 'క' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత 'దిల్ రూబా'తో ఆడియన్స్ ను పలకరించాడు. అయితే 'దిల్ రూబా' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
లేటెస్ట్ గా కిరణ్ 'కె ర్యాంప్' మూవీతో వస్తున్నాడు. ‘కె’ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్, ఆ సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో 'కె-ర్యాంప్'పై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. ఇప్పుడు 'ది రిచెస్ట్ చిల్లర్ గయ్' అనే టైటిల్ తో ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.
ఈ గ్లింప్స్ లో కిరణ్ అబ్బవరం ఊర మాస్ పాత్రలో అదరగొట్టాడు. గ్లింప్స్ అంతా ఊరనాటు భాషలో ఉండటం ఈ సినిమా టోన్ ను తెలుపుతుంది. ఇందులో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కాస్త శ్రుతిమించిన్టు అనిపిస్తుంది. పక్కా ‘చిల్లర గాడు’గా కొత్త క్యారెక్టర్ లో కనిపిస్తూ 'కె-ర్యాంప్'తో తన నటనా పరిధిని విస్తరించుకునే పనిలో పడ్డాడు కిరణ్ అబ్బవరం.
జైన్స్ నాని దర్శకత్వంలో మాస్ కామెడీగా రాబోతున్న ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేష్ దండా, శివ బొమ్మక్ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
-
Home
-
Menu