యువ నిర్మాతల ఆవేదన

టాలీవుడ్‌లో సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌పై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. 30 శాతం వేతన పెంపు కోరుతున్న కార్మికులపై, చిన్న సినిమాల నిర్మాతలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు ఎస్‌కేఎన్, రాజేష్ దండా, మధుర శ్రీధర్, చైతన్య రెడ్డి, శరత్ చంద్ర, ధీరజ్ పాల్గొన్నారు.
నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ 'ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజినెస్ పరిస్థితి బాగోలేదు. ఓ ప్రాతిపదికన కాకుండా అందరికీ ఒకేసారి వేతనాలు పెంచడం చిన్న నిర్మాతలకు కష్టమే. మేము పాన్ ఇండియా సినిమాలు నిర్మించడం లేదు. టికెట్ ధరల పెంపులు పెద్ద సినిమాలకు మాత్రమే వర్తిస్తాయి. మిగతా చిన్న సినిమాలు ఆ సౌకర్యం పొందవు. 2022లో చిన్న నిర్మాతలకు 25 శాతం తగ్గించి ఇవ్వమని ఒప్పందం జరిగింది, కానీ యూనియన్లు దాన్ని పాటించలేదు. వేతనాలు పెంచమంటే బాగానే ఉంది, కానీ మా సినిమాల పెట్టుబడికి తగిన బిజినెస్ ఎవరు చేస్తారు? థియేటర్లకు ప్రేక్షకులను ఎవరు రప్పిస్తారు?' అని ప్రశ్నించారు.
రాజేష్ దండా మాట్లాడుతూ 'నిర్మాతలకు రావాల్సిన పేమెంట్లు కూడా ఆలస్యమవుతున్నాయి. ఓటీటీలు డబ్బులు ఇవ్వడంలో సమయం తీసుకుంటున్నాయి. కానీ కార్మికుల వేతనాలు మాత్రం అదే రోజున చెల్లించాలి అంటున్నారు' అని తెలిపారు.
మధుర శ్రీధర్ తన అనుభవాన్ని పంచుకుంటూ 'ఇటీవల ఒక చిన్న సన్నివేశం కోసం ఐదుగురితో పూర్తయ్యే పనిని, యూనియన్ నిబంధనల వల్ల 80 మందితో చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాత అనుకున్న బడ్జెట్‌లో తన కథను చెప్పుకోవడం కష్టమవుతుంది' అన్నారు.
చైతన్య రెడ్డి మాట్లాడుతూ 'మాకు నచ్చిన వారిని ఎందుకు పెట్టుకోకూడదు? వేతనం ఇవ్వకుండా మేము పని చేయించుకోవడం లేదు. ఇప్పుడు వేతనాల పెంపు భారంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏ నిర్మాత లాభాల్లో లేరు. కేవలం సినిమా మీద ప్యాషన్‌తోనే మేము ముందుకు వెళ్తున్నాం. నిర్మాతల పరిస్థితి కూడా అందరూ అర్థం చేసుకోవాలి' అన్నారు.
-
Home
-
Menu