శ్రీదేవి ఆస్తి వివాదం

శ్రీదేవి ఆస్తి వివాదం
X
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తన భార్య, దివంగత నటి శ్రీదేవి పేరున్న ఆస్తిపై తలెత్తిన వివాదం నేపథ్యంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తన భార్య, దివంగత నటి శ్రీదేవి పేరున్న ఆస్తిపై తలెత్తిన వివాదం నేపథ్యంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఆ స్థిరాస్తి తమదే అయినప్పటికీ, ముగ్గురు వ్యక్తులు దానిని అక్రమంగా ఆక్రమించి, వారసత్వ హక్కులు సొంతం చేసుకున్నట్లు తప్పుడు ధ్రువపత్రాలను తయారు చేసుకున్నారని ఆయన కోర్టుకు వివరించారు.

1988 ఏప్రిల్ 19న శ్రీదేవి, ఎం.సి. సంబంద ముదలియార్ అనే వ్యక్తి కుటుంబం నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. అప్పట్లో ముదలియార్ కుమారులు, కుమార్తెల సమ్మతితోనే రిజిస్ట్రేషన్ జరిగిందని, అన్ని పత్రాలు చట్టబద్ధంగానే ఉన్నాయని బోనీ కపూర్ వాదించారు. ఆ స్థిరాస్తిని తన భార్య ఎంతో కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిందని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

తాజాగా, ముదలియార్ రెండో భార్య పిల్లలమని పేర్కొంటూ ముగ్గురు వ్యక్తులు ముందుకు వచ్చారు. తాము కూడా ఆ ఆస్తిలో వాటా ఉన్న వారమేనని చెబుతూ, 2005లో తాంబరం తహసీల్దార్ కార్యాలయం నుంచి వారసత్వ ధ్రువీకరణ పత్రం పొందారు. ఈ పత్రం ఆధారంగా భూమిపై హక్కులు చూపించేందుకు ప్రయత్నించారని బోనీ కపూర్ తెలిపారు.

అయితే, ముదలియార్ రెండో వివాహం 1975లో జరిగినదని ఆ ముగ్గురు వాదిస్తున్నప్పటికీ, ఆయన మొదటి భార్య 1999లోనే మరణించారు. అంటే, మొదటి భార్య బతికే ఉన్న సమయంలో రెండో వివాహం జరగడం వలన ఆ వివాహం చట్టబద్ధం కాదని, హిందూ వారసత్వ చట్టం ప్రకారం రెండో భార్య పిల్లలు చట్టబద్ధ వారసులుగా పరిగణించబడరని బోనీ కపూర్ స్పష్టం చేశారు.

ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్, తాంబరం తహసీల్దార్‌ ఇచ్చిన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించి, నాలుగు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తాంబరం తహసీల్దార్‌కు ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి అధికారం ఉందా అనే అంశాన్నీ పరిశీలించాలని కోర్టు స్పష్టంచేసింది.

Tags

Next Story