'సితారే జమీన్ పర్' ట్రైలర్!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మళ్లీ తెరపైకి వస్తున్న చిత్రం 'సితారే జమీన్ పర్'. 'తారే జమీన్ పర్'కి సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీలో మరో హృదయాన్ని తాకే కథతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక వినూత్నమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించిన 'సితారే జమీన్ పర్' విడుదలకు ముస్తాబవుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
ఈ సినిమా ఒక బాస్కెట్ బాల్ కోచ్ గుల్షన్ (ఆమిర్ ఖాన్) చుట్టూ తిరుగుతుంది. అతను ప్రమాదవశాత్తూ పోలీస్ వాహనాన్ని ఢీకొనడంతో కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. మానసికంగా వెనుకబడిన కొంతమందికి బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. ఇష్టం లేకుండానే ఆ పదవి స్వీకరిస్తాడు గుల్షన్. మొదట్లో వారికి కోచింగ్ ఇవ్వడం భారం అనిపించినా, ఆ ప్రయాణంలో అతను నేర్చుకునే విలువలు, మార్పులు కథను ముందుకు నడిపిస్తాయి.
2007లో విడుదలైన 'తారే జమీన్ పర్' కథకు 'సితారే జమీన్ పర్'కు ఏమాత్రం సంబంధం లేదు. ఈసారి కథనంలో హ్యూమర్, ఎమోషన్, స్పోర్ట్స్ స్పిరిట్ మేళవింపు కనిపిస్తుంది. జెనీలియా మరో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా ద్వారా చాలా మంది నూతన నటీనటులు పరిచయం అవుతున్నారు. జూన్ 20న విడుదల కానున్న ఈ చిత్రంపై ఆమిర్ ఖాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆశతో ఉన్నాడు అమీర్ ఖాన్.
-
Home
-
Menu