వివాదాల నుండి విలువల దిశగా ఆర్జీవీ!

వివాదాల నుండి విలువల దిశగా ఆర్జీవీ!
X
వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘సత్య’ గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆల్‌టైమ్‌ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ భావోద్వేగానికి లోనై ట్విటర్‌లో తన అనుభూతులు పంచుకున్నాడు.

అవధుల్లేని ఆలోచనాసరళి.. విలక్షణమైన వ్యక్తిత్వం.. వివాదాలంటే ప్రియత్వం.. వెరసి రామ్ గోపాల్ వర్మను మిగతా దర్శకుల్లోకి ప్రత్యేకంగా నిలుపుతాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మది ప్రత్యేక స్థానం.


అయితే గత కొన్నేళ్లుగా రామ్ గోపాల్ వర్మ ఆన్ స్క్రీన్ పై తన మ్యాజిక్ ను చూపించలేకపోతున్నాడు. ఎక్కవగా కాంట్రవర్శీలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు తప్ప.. మంచి సినిమా తీశాడనే ప్రశంసలు అతనికి దూరమై చాలా ఏళ్లయ్యింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాన్ని మరో కోణంలో ప్రేక్షకులతో పంచుకున్నాడు రాము.


విషయానికొస్తే.. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘సత్య’ సినిమా గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆల్‌టైమ్‌ క్లాసిక్‌గా నిలిచింది. జేడీ చక్రవర్తి, మనోజ్‌ బాజ్‌పేయి, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 27 ఏళ్ల తర్వాత జనవరి 17న రీ రిలీజయ్యింది. ఈ సందర్భంగా సందర్భంగా ‘సత్య‘ సినిమాను వీక్షించిన ఆర్జీవీ భావోద్వేగానికి లోనై ట్విటర్‌లో (ఎక్స్‌) తన అనుభూతులు పంచుకున్నాడు.


27 ఏళ్ల తర్వాత ‘సత్య‘ చూసినప్పుడు, ఆ సమయంలో తన సినీ ప్రయాణాన్ని తలుచుకుని కన్నీళ్లు ఆపుకోలేకపోయినట్లు వెల్లడించాడు. సక్సెస్‌ మరియు అహంకారం తన కళ్లు మూసేశాయని, అసంబద్ధమైన ప్రయోగాలతో విలువైన అవకాశాలను కోల్పోయానని చెప్పాడు.


తాను చేసిన తప్పులను తిరిగి సరిదిద్దుకోలేనప్పటికీ, భవిష్యత్తులో తీసుకునే ప్రతి చిత్రంపై ‘సత్య‘లో చూపినంత నిజాయితీ చూపించేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. అలాగే ‘సత్యపై ఒట్టేసి చెప్తున్నా, నా మిగిలిన జీవితాన్ని విలువైన సినిమాలకు అంకితం చేస్తాను‘ అని ఆర్జీవీ చెప్పడం అతని అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. మొత్తంగా ఆర్జీవి ట్వీట్ చూసిన నెటిజన్లు మాత్రం వర్మ నిజంగా మారాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/RGVzoomin/status/1881184801765695523


Tags

Next Story